గ్రౌండ్‌లో కుప్ప‌కూలిన మరో స్టార్‌ ప్లేయర్‌..

16 Jun, 2021 17:50 IST|Sakshi

మ్యూనిచ్‌‌: డెన్మార్క్‌ ప్లేయర్‌ క్రిస్టియ‌న్‌ ఎరిక్‌స‌న్‌ ఘటన మరువకముందే యూరోక‌ప్‌ 2020లో మ‌రో స్టార్‌ ప్లేయ‌ర్ గ్రౌండ్‌లోనే కుప్ప‌కూలాడు. ఆ ఆటగాడు10 నుంచి 15 సెక‌న్ల పాటు స్పృహ కోల్పోవ‌డంతో సహచర ఆటగాళ్లు ఆందోళ‌న చెందారు. జ‌ర్మ‌నీతో మ్యాచ్ సంద‌ర్భంగా ఫ్రాన్స్ డిఫెండ‌ర్ బెంజ‌మిన్ ప‌వార్డ్ ప్ర‌త్య‌ర్థి ప్లేయ‌ర్ రాబిన్ గోసెన్స్‌ను ఢీకొట్టడంతో వెంట‌నే కింద ప‌డిపోయి స్పృహ కోల్పోయాడు. అయితే ఘటన తర్వాత కొన్ని నిమిషాల పాటు పవార్డ్‌కు చికిత్సనందించడంతో అతను కోలుకున్నాడు. అనంతరం మ్యాచ్‌లో కూడా కొన‌సాగాడు. అయితే, స్పృహ కోల్పోయిన ఆటగాడిని మ్యాచ్‌లో ఎలా కొన‌సాగిస్తారని, అత‌డు కంక‌ష‌న్‌కు గుర‌య్యే ప్ర‌మాదం ఉందని సోష‌ల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత ఎదురవడంతో ఫ్రాన్స్ జట్టు యాజమాన్యం అతన్ని మైదానం నుంచి బయటకు పంపింది.

అతని స్థానంలో స‌బ్‌స్టిట్యూట్‌ ఆటగాడిని బరిలోకి దించింది. ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్‌ 1-0తో జర్మనీపై గెలుపొందింది. మ్యాచ్‌ అనంతరం గాయపడిన పవార్డ్‌ మాట్లాడుతూ.. ప్రత్యర్ధి ఆటగాడు బలంగా ఢీకొట్ట‌డం వల్ల షాక్‌కు లోనయ్యాని, దాంతో కాసేపు స్పృహ కోల్పోయాన‌ని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే, ఇదే టోర్నీలో డెన్మార్క్ ప్లేయ‌ర్ క్రిస్టియ‌న్‌ ఎరిక్‌స‌న్ కార్డియాక్‌ అరెస్ట్‌ కారణంగా మైదానంలోనే కుప్ప‌కూలిన విషయం తెలిసిందే. అత‌న్ని వెంట‌నే గ్రౌండ్ నుంచి హాస్పిట‌ల్‌కు తరలించడంతో ప్రాణాపాయస్థితి నుంచి బయటపడి ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఊహించని ఈ పరిణామానికి షాక్‌ తిన్న ఫుట్‌బాల్‌ ప్రపంచం, వెంటనే అలాంటి ఘటనే పునరావృతం కావడంతో ఉలిక్కిపడింది. అయితే, పవార్డ్‌కు ఏమీ కాకపోవడంతో సాక‌ర్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
చదవండి: కోక్‌ బాటిల్‌ వ్యవహారంతో 30 వేల కోట్లు హాంఫట్‌, మరి ఈయన బీర్‌ బాటిల్‌ తీసేశాడు

మరిన్ని వార్తలు