EURO CUP 2020: ఫైనల్‌ చేరిన ఇటలీ

7 Jul, 2021 07:51 IST|Sakshi

లండన్‌: యూఈఎఫ్‌ఏ చాంపియన్‌షిప్‌ యూరోకప్‌ 2020 కప్‌లో ఇటలీ ఫైనల్లో అడుగుపెట్టింది. స్పెయిన్‌తో జరిగిన సెమీస్‌ మ్యాచ్‌లో ఫెనాల్టీ షూటౌట్‌ ద్వారా ఇటలీ విజయం సాధించింది. మ్యాచ్‌లో భాగంగా ఇటలీ తరపున 60వ నిమిషంలో ఫెడెరికో చిసా గోల్‌ చేయగా.. స్పెయిన్‌ తరపున అల్వారో మొరాటా 80వ నిమిషంలో గోల్‌ చేశాడు. మ్యాచ్‌ ముగిసే సమయానికి 1-1తో సమంగా నిలిచిన ఇటలీ, స్పెయిన్‌లు తమకు కేటాయించిన ఎక్స్‌ట్రా టైమ్‌లోనూ గోల్‌ చేయడంలో విఫలమయ్యాయి. దీంతో ఫెనాల్టీ షూటౌట్‌ ద్వారా ఫలితం తేల్చాల్సి వచ్చింది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఫెనాల్టీ షూట్‌ట్‌లో ఇటలీ 4-2 తేడాతో స్పెయిన్‌పై విజయం సాధించింది. ఇక రెండో సెమీస్‌ మ్యాచ్‌ భారత కాలమాన ప్రకారం రాత్రి 12.30 గంటలకు ఇంగ్లండ్‌, డెన్మార్క్‌ మధ్య జరగనుంది.

బ్రెజిల్‌ 21వసారి ఫైనల్లోకి... 
రియో డి జనీరో: కోపా అమెరికా కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో బ్రెజిల్‌ జట్టు 21వసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. పెరూ జట్టుతో జరిగిన తొలి సెమీఫైనల్లో బ్రెజిల్‌ 1–0తో నెగ్గింది. ఆట 34వ నిమిషంలో నేమార్‌ అందించిన పాస్‌ను లుకాస్‌ పక్వెటా గోల్‌ పోస్ట్‌లోనికి పంపించాడు. అర్జెంటీనా, కొలంబియా జట్ల మధ్య రెండో సెమీఫైనల్‌ విజేతతో ఫైనల్లో బ్రెజిల్‌ తలపడుతుంది. వందేళ్లకంటే ఎక్కువ చరిత్ర కలిగిన ఈ టోర్నీలో బ్రెజిల్‌ తొమ్మిదిసార్లు విజేతగా, 11 సార్లు రన్నరప్‌గా నిలిచింది.  

మరిన్ని వార్తలు