హైదరాబాద్‌లో ప్రతీ పేపర్‌లో నీ ఫోటోనే..!

25 Oct, 2020 17:51 IST|Sakshi

దుబాయ్‌: నాలుగు రోజుల క్రితం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఎనిమిది వికెట్ల తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది. ముందుగా కేకేఆర్‌ను 84 పరుగులకే పరిమితం చేసిన ఆర్సీబీ.. ఆపై 13.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఆ మ్యాచ్‌లో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహిస్తున్న హైదరాబాద్‌ ఆటగాడు మొహ్మద్‌ సిరాజ్‌ గురించే చెప్పుకోవాలి. తన నాలుగు ఓవర్ల కోటాలో రెండు మెయిడిన్ల సాయంతో 8 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు సాధించాడు. తన తొలి రెండు ఓవర్లలో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా అతను తీసిన 3 వికెట్లు బెంగళూరు విజయానికి పునాది వేశాయి.(విరాట్‌ కోహ్లి @200)

మ్యాచ్‌ తర్వాత ఇంటికి ఫోన్‌ చేసిన సిరాజ్‌కు తన తండ్రి ఇంట్లోనే ఉన్నాడని తెలుసుకుని ఆశ్చర్యపోయాడట. తన తండ్రి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో బాధపడుతూ శ్వాస తీసుకోవాడని ఇబ్బందులు పడటంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడని సిరాజ్‌ తెలిపాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌కు ముందు తన తండ్రి ఆస్పత్రిలో జాయిన్‌ అయ్యాడన్నాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌ తర్వాత తనతో మాట్లాడటం జరిగిందన్నాడు. ఈ మేరకు ఒక వీడియోలో సిరాజ్‌ అనేక విషయాలను షేర్‌ చేసుకున్నాడు. ‘ కొన్ని రోజులుగా మా నాన్నకు ఆరోగ్యం బాలేదు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. శ్వాస తీసుకోవడం చాలా కష్టంగా ఉంది. మా నాన్న ఆరోగ్యం గురించి నేను చాలా ఆందోళన చెందుతున్నా. ఇంటికి వెళ్లలేని పరిస్థితి. దగ్గర ఉండి నాన్న చూసుకోలేకపోతున్నా అనే బాధ ఉండేది. ఫోన్‌లోనే ఎక్కువగా మాట్లాడేవాడ్ని.

నేను ఫోన్‌లో మాట్లాడిన ప్రతీసారి ఏడ్చేవాడు. దాంతో నాన్నతో ఫోన్‌ను మధ్యలోనే కట్‌ చేసేవాడిని. నాన్న ఏడ్వటాన్ని చూడలేకపోయేవాడిని. అతనికి మంచి ఆరోగ్యాన్ని ఇమ్మని దేవున్ని ప్రార్థించడం తప్పితే ఏమీ చేయలేకపోయేవాణ్ని. ఈ క్రమంలోనే నేను ఆడిన(కేకేఆర్‌తో) చివరి మ్యాచ్‌కు ముందు ఆస్పత్రిలో చేర్పించారు. అయితే కేకేఆర్‌తో మ్యాచ్‌ తర్వాత ఇంటికి ఫోన్‌ చేస్తే నాన్న ఇంట్లోనే ఉన్నారని తెలుసుకుని ఆశ్చర్యపోయా. చాలా సంతోషంగా అనిపించింది. నాకు నాన్న చాలా విషయాలు చెప్పారు. ప్రతీ ఒక్కరూ నాన్నకు ఫోన్‌ చేసి నా ప్రదర్శన గురించి చెప్పారట. హైదరాబాద్‌లోని ప్రతీ న్యూస్‌ పేపర్‌లో నా ఫోటోనే ఉందని నాన్న చెప్పారు. ఆ మాటలు నాకు చాలా సంతోషం అనిపించాయి. అదంతా దేవుని ఆశీర్వాదమేనని నేను నాన్నకు చెప్పా. నాన్నను చింతించవద్దని, ఇంట్లోనే ఉండమని చెప్పాను. ఇలా నా సక్సెస్‌ను చూసి తండ్రి ఆనందం వ్యక్తం చేయడంతో నాకు కాస్త బెంగ తీరింది’ అని సిరాజ్‌ తెలిపాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు