Sania Mirza-Smriti Mandhana: ' చిన్నప్పుడు నువ్వు పెద్ద టార్చ్‌బేరర్‌..'

5 Mar, 2023 13:14 IST|Sakshi

టీమిండియా వుమెన్స్‌ స్టార్‌ క్రికెటర్‌ స్మృతి మంధాన ఇప్పుడు బాగా పాపులర్‌. సౌరవ్‌ గంగూలీ బ్యాటింగ్‌ స్టైల్‌ను తలపించే స్మృతి మంధాన ఇటీవలే ముగిసిన టి20 ప్రపంచకప్‌లో తన ప్రదర్శనతో ఆకట్టుకుంది. తాజాగా వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌(WPL 2023)లో భాగంగా మంధాన ఆర్‌సీబీ వుమెన్స్‌ కెప్టెన్‌గా ఎంపికైంది. రికార్డు స్థాయిలో రూ.3.4 కోట్లకు అమ్ముడై చరిత్ర సృష్టించింది. ఆర్‌సీబీ నాయకురాలిగా జట్టును నడిపించనున్న మంధాన ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్‌తో అమితుమీ తేల్చుకోనుంది. కాగా ఆర్‌సీబీ.. జట్టు మెంటార్‌గా టెన్నిస్‌ మాజీ స్టార్‌ సానియా మీర్జాను నియమించిన సంగతి తెలిసిందే.

కాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌కు సన్నద్దమవుతున్న నేపథ్యంలో ఆర్‌సీబీ కెప్టెన్‌ స్మృతి మంధాన, సానియా మీర్జాలు ఒకరినొకరు ఇంటర్య్వూ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఆర్‌సీబీ తన ట్విటర్‌లో షేర్‌ చేసింది. ఈ సందర్భంగా సానియా, మంధానలు కెరీర్‌ పరంగా ఎదిగిన తీరు, ఒత్తిడిని తట్టుకొని ఆడిన మ్యాచ్‌లు, ఆర్‌సీబీ లాంటి స్టార్‌ ఫ్రాంచైజీకి వివిధ హోదాల్లో ప్రాతినిధ్యం వహించడం గురించి పిచ్చాపాటిగా మాట్లాడుకున్నారు. 

స్మృతి మంధాన మాట్లాడుతూ..'' నా ఇంట్లో సానియా మీర్జాను ఆదర్శంగా తీసుకున్నారు. సానియా ఎదుగుదల చూసి క్రికెట్‌ కంటే టెన్నిస్‌ ఆటను ఏంచుకోవాలంటూ ఎంకరేజ్‌ చేసేవారు. కానీ నా దృష్టంతా క్రికెట్‌పైనే ఉండేది. అందుకే నా చిన్నప్పుడు సానియా పెద్ద టార్చ్‌బేరర్‌లా కనిపించేది. ఎందుకంటే ప్రతి మహిళా అథ్లెట్‌ మరో సానియాలా తయారవుదామనుకునేవారు. అప్పట్లో ఇది బాగా ట్రెంట్‌ అయింది.

9 లేదా 10 ఏళ్లు అనుకుంటా నాకు బాగా గుర్తు.. మా అమ్మ నాతో ఒక విషయం చెప్పింది. ఎందుకు నువ్వు టెన్నిస్‌ను ఏంచుకోకూడదు.. అని ప్రశ్నించింది. దానికి నాకు క్రికెట్‌ అంటే అమితమైన ఆసక్తి.. ఇప్పటికిప్పుడు క్రికెట్‌ నుంచి టెన్నిస్‌లోకి రాలేను. అందుకే క్రికెట్‌లో రాణించి మరో సానియాలా పేరు తెచ్చుకుంటా అని అమ్మకు మాటిచ్చా'' అంటూ తెలిపింది. మంధాన మాటలకు స్పందించిన సానియా.. ''థ్యాంక్‌ గాడ్‌ బతికించావు.. లేకుండా నాకు పోటీగా మరొకరు వచ్చేవారేమో(నవ్వుతూ)'' పేర్కొంది.

ఇక మంధాన జెర్సీ నెంబర్‌ 18 ధరించడంపై సానియా ప్రశ్నించింది. టీమిండియాలో నెంబర్‌-18కి ప్రత్యేక స్థానం ఉంది. అది కోహ్లి జెర్సీ.. ఆర్‌సీబీ కూడా కోహ్లికి 18వ నెంబర్‌ కేటాయించింది.  క్రికెట్‌ చరిత్రలోనే కోహ్లి బెస్ట్‌ క్రికెటర్‌గా పేరు పొందాడు. మరి అలాంటి జెర్సీ నువ్వు ధరించడంపై ఏమంటావు అని సానియా అడిగింది. దీనికి మంధాన స్పందిస్తూ.. ''గత పదేళ్లుగా నా జెర్సీ నెంబర్‌ సంఖ్య కూడా 18. అయితే యాదృశ్చికంగా కింగ్‌ కోహ్లి జెర్సీ కూడా అదే. అతనితో నా ఆటను పోల్చలేను. కానీ ఆర్‌సీబీ కోహ్లి అంత పేరు తెచ్చుకోవాలని అదే జెర్సీ నెంబర్‌ను నాకు కంటిన్యూ చేసింది. దీనిని నేను స్వాగతిస్తా.'' అంటూ ముగించింది.

చదవండి: హై స్కోరింగ్‌ మ్యాచ్‌ల కోసం ఇంత దిగజారాలా?

మరిన్ని వార్తలు