లూయిస్‌, గేల్‌ సిక్సర్ల సునామీ.. విండీస్‌దే తొలి టీ20

27 Jun, 2021 17:07 IST|Sakshi

సెయింట్‌ జార్జియా: ఓపెనర్‌ ఎవిన్‌ లూయిస్‌(35 బంతుల్లో 71; 4 ఫోర్లు, 7 సిక్సర్లు), యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌(24 బంతుల్లో 32; ఫోర్, 3 సిక్సర్లు), ఆండ్రీ రసెల్‌(12 బంతుల్లో 23; ఫోర్‌, 3 సిక్సర్లు), ఆండ్రీ ఫ్లెచర్‌(19 బంతుల్లో 30; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) సిక్సర్లతో విరుచుకుపడటంతో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ 20లో విండీస్‌ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. 5 టీ20ల సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో అతిధ్య జట్టు సఫారీలను మట్టికరిపించి, సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో విండీస్‌ టాస్‌ గెలిచి ప్రత్యర్ధిని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

వాన్ డర్ డుసెన్ (38 బంతుల్లో 56 పరుగులు), వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ డికాక్ (24 బంతుల్లో 37) రాణించడంతో సఫారీ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. ఫాబియన్‌ అలెన్‌, బ్రావోలకు తలో రెండు వికెట్లు, హోల్డర్‌, రసెల్‌లకు చెరో వికెట్‌ దక్కింది. అనంతరం 161 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విండీస్‌.. కేవలం 15 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. సఫారీ బౌలర్‌ షంషికి ఓ వికెట్‌ దక్కగా, ఫ్లెచర్‌ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఆదివారం జరుగనుంది. కాగా, సఫారీలతో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ను ఆతిధ్య జట్టు 0-2తేడాతో కోల్పోయింది. 
చదవండి: WTC Final: ‘ఒక్క గంట ఆట, ఇమేజ్‌ మొత్తం డ్యామేజీ’

మరిన్ని వార్తలు