Justin Langer: 'నెంబర్‌ వన్‌ స్థానం నావల్లే.. వాడుకొని వదిలేశారు'

23 Nov, 2022 13:26 IST|Sakshi

ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు జస్టిన్‌ లాంగర్‌ క్రికెట్‌ ఆస్ట్రేలియాతో పాటు టెస్టు, వన్డే కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ తీరును ఎండగట్టాడు. అవసరం ఉన్నప్పుడు వాడుకున్నారని.. మరో అవకాశం ఇవ్వాలని అడిగితే పదవి నుంచి తొలగించారంటూ అసహనం వ్యక్తం చేశాడు. 

విషయంలోకి వెళితే.. 2021లో జరిగిన టి20 ప్రపంచకప్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా టైటిల్‌ను ఎగురేసుకుపోయి అందరిని ఆశ్చర్యపరిచింది. దీని వెనకాల ప్రధాన కారణం అప్పటి కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌. ఆ తర్వాత స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌ను 4-0తేడాతో గెలవడంలోనూ లాంగర్‌దే ప్రముఖ​ పాత్ర అని చెప్పొచ్చు. అతని హయాంలోనే ఆస్ట్రేలియా మళ్లీ టెస్టుల్లో నెంబర్‌వన్‌ ర్యాంక్‌కు చేరుకుంది. ఇప్పటికీ ఆస్ట్రేలియానే టెస్టుల్లో నెంబర్‌వన్‌గా ఉంది. 

ఎంత కాదన్నా కోచ్‌, ఆటగాళ్లు కలిస్తేనే ఇది సాధ్యమవుతుంది. అలా ఏడాది వ్యవధిలో రెండు గొప్ప ఫీట్‌లు సాధించిన కోచ్‌గా లాంగర్‌ పేరు గడించాడు. ఆ తర్వాత తన పదవిని పొడిగించాలని క్రికెట్‌ ఆస్ట్రేలియాను కోరాడు. కానీ క్రికెట్‌ ఆస్ట్రేలియా మాత్రం లాంగర్‌ పదవిని మరో ఆరు నెలల పాటు మాత్రమే పొడిగించింది. పాకిస్తాన్‌ గడ్డపై టెస్టు సిరీస్‌ ఆడేందుకు ఆస్ట్రేలియా బయలుదేరి వెళ్లిన సమయంలోనే లాంగర్‌ను తొలగించి ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ను కొత్త కోచ్‌గా ఎంపిక చేసింది. అలా లాంగర్‌కు క్రికెట్‌ ఆస్ట్రేలియాతో బంధం ముగిసింది.

తాజాగా తనకు జరిగిన అన్యాయంపై లాంగర్‌ డెయిలీ మెయిల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో స్పందించాడు.''తనకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన వారు పిరికివాళ్లని.. కానీ మెజారిటీ ఆటగాళ్లు మద్దతు ఇచ్చారు. పాట్ కమిన్స్‌ సహా కొందరు ఆటగాళ్లు నా ముందు మంచిగా నటించి వెనుక మత్రం గోతులు తవ్వినట్లుగా అనిపించింది. కోచ్‌గా నేను నచ్చకపోతే ముఖం మీద చెప్పాల్సింది.. ఇలా వెనుక మాట్లాడడం తగదు.

కోచ్‌కు, ఆటగాళ్లకు మధ్య చిన్న చిన్న మనస్పర్థలు రావడం కామన్‌. నాకు తెలియకుండా పాట్‌ కమిన్స్‌ లాంటి కొందరు వ్యక్తులు తమ స్వలాభం కోసం మాలో జరిగిన కొన్ని విషయాలను లీక్‌ చేశారు. ఇది నా దృష్టిలో పెద్ద తప్పు. ఇక నేను పదవికి రాజీనామా చేసే సమయానికి జట్టు నెంబర్‌వన్‌లో ఉంది. దానిని కూడా సరిగ్గా ఎంజాయ్‌ చేయకుండానే నన్ను కోచ్‌ పదవి నుంచి తప్పించారు.'' అంటూ పేర్కొన్నాడు.

చదవండి: బంధం ముగిసింది.. రొనాల్డోతో మాంచెస్టర్‌ యునైటెడ్‌ తెగదెంపులు

సరికొత్త ఫార్మాట్‌లో 2024 టి20 వరల్డ్‌కప్‌

మరిన్ని వార్తలు