హ్యాలో కాపాడింది...

1 Dec, 2020 02:07 IST|Sakshi

అక్కరకొచ్చిన ఎఫ్‌1 భద్రతా ప్రమాణాలు

నాడు వ్యతిరేకించిన వారే నేడు మెచ్చుకుంటున్నారు

కోలుకుంటున్న హాస్‌ జట్టు డ్రైవర్‌ రొమైన్‌ గ్రోస్యెన్‌

సాఖిర్‌: బహ్రెయిన్‌ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్‌ రేసులో ఆదివారం పెను ప్రమాదమే జరిగినా... హాస్‌ జట్టు డ్రైవర్‌ రొమైన్‌ గ్రోస్యెన్‌ స్వల్ప గాయాలతో బయటపడటం గొప్ప విశేషం. కారుపై నియంత్రణ కోల్పోయి బారికేడ్లను ఢీకొట్టడంతో కారు రెండు ముక్కలైంది. కాక్‌పిట్, చాసిస్‌ వేరుపడ్డాయి. దీంతో పెట్రోల్‌ లీకేజితో ఒక్కసారిగా సిలిండర్‌ పేలినట్లు మంటలు చెలరేగాయి. ఇంతటి ఘోరప్రమాదం జరిగినా గ్రోస్యెన్‌ ప్రాణం మీదికి రాకపోవడంతో ఫార్ములావన్‌ (ఎఫ్‌1), బహ్రెయిన్‌ వర్గాలకు పెద్ద ఊరటే లభించింది.

34 ఏళ్ల గ్రోస్యెన్‌ను హుటాహుటిన హెలికాప్టర్‌లో మిలిటరీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అతని చేతి వేళ్లకు కాలిన గాయాలయ్యాయి. ఇది మినహా ఎలాంటి ఫ్రాక్చర్, ప్రాణాపాయ సమస్యలు లేవు. ఇంకా చెప్పాలంటే అంతపెద్ద మంటల్లో... ఫైర్‌ మార్షల్స్‌ మంటల్ని అదుపు చేస్తుంటే అతనే ఎంచక్కా బారికేడ్‌ను దూకుతూ దాటాడు. ఇద్దరు సాయమందించినా... తనే నడుచుకుంటూ అంబులెన్స్‌ ఎక్కాడు. పెను ప్రమాదం నుంచి అతను చిన్న చిన్న గాయాలతో బయటపడటం నిజంగా అద్భుతమని 1996 ఎఫ్‌1 చాంపియన్‌ డామొన్‌ హిల్‌ అన్నారు.  

అదే రక్షించింది...
ఫార్ములావన్‌ ఆధునికతే గ్రోస్యెన్‌కు ఊపిరి పోసింది. కొన్నేళ్లు పరీక్షించిన మీదట డ్రైవర్ల ప్రాణాలను నిలుపుతుందని భావించిన ఎఫ్‌1 సంస్థ 2018లో రేస్‌ కార్లలో హ్యాలో సిస్టమ్‌ను అమలు చేసింది. డ్రైవర్‌ తలకు ఏమాత్రం గాయమవ్వకుండా ఉండే రక్షణ కవచం ఇది. కారు కాక్‌పిట్‌లో ఓ ఫ్రేమ్‌గా తలపై భాగాన్ని కవర్‌ చేస్తుంది. 2016లో వచ్చిన హ్యాలో సిస్టమ్‌కు లేటెస్ట్‌ వర్షన్‌ (ఆధునిక) తోడవడంతో 2017లో ఎఫ్‌1 సంస్థ ప్రయోగాత్మకంగా పరిశీలించింది. 17 శాతం ప్రాణాపాయాన్ని తగ్గించగలదని ధ్రువీకరించుకున్న ఎఫ్‌1 ఆ మరుసటి ఏడాది అధికారికంగా అమల్లో పెట్టింది. కానీ ఆనాడు దీన్ని రొమైన్‌ గ్రోస్యెన్‌ తీవ్రంగా తప్పుబట్టాడు. ‘హ్యాలో అంటే నాకు అసహ్యం. ఇదేం బాగోలేదు. దీంతో నాకు అస్వస్థత అయిన అనుభవం కలిగింది’ అని స్పందించాడు. కానీ ఇప్పుడదే సంజీవనిగా అతనికి ఉపయోగపడింది.

బరిలోకి పియెట్రో...
హాస్‌ టీమ్‌ డ్రైవర్‌ గ్రోస్యెన్‌ తదుపరి రేసుకు దూరమవ్వడంతో హాస్‌ టీమ్‌ అతని స్థానాన్ని బ్రెజిల్‌ రిజర్వ్‌ డ్రైవర్‌ పియెట్రో ఫిటిపాల్డికి ఇచ్చింది. దీంతో సాఖిర్‌లోనే ఈ వారాంతంలో జరిగే రేసుతో పియెట్రో ఫార్ములావన్‌లో అరంగేట్రం చేయనున్నాడు. పియెట్రో కుటుంబానికి ఎఫ్‌1తో సుదీర్ఘ అనుబంధం ఉంది. పియెట్రో తాత ఎమర్సన్‌ 1972, 1974లో ఎఫ్‌1 వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచారు. ఎమర్సన్‌ సోదరుడు విల్సన్‌... విల్సన్‌ తనయుడు క్రిస్టియన్‌ ఫిటిపాల్డి కూడా ఎఫ్‌1 రేసుల్లో పాల్గొన్నారు.

కొన్నేళ్ల క్రితం నేను హ్యాలో సిస్టమ్‌ను వ్యతిరేకించాను. కానీ ఇప్పుడదే నన్ను కాపాడింది. ఇప్పుడు అది లేకుంటే నేనిలా మీ ముందు మాట్లాడేవాణ్నే కాదు.      
      

–గ్రోస్యెన్‌

మరిన్ని వార్తలు