‘మొనాకో’ విజేత పెరెజ్‌

30 May, 2022 10:08 IST|Sakshi

మోంటెకార్లో: పలుమార్లు వర్షం అంతరాయం కలిగించిన మొనాకో గ్రాండ్‌ప్రి ఫార్ములావన్‌ రేసులో రెడ్‌బుల్‌ జట్టు డ్రైవర్‌ సెర్జియో పెరెజ్‌ విజేతగా నిలిచాడు. ఆదివారం మోంటెకార్లో నగర వీధుల్లో జరిగిన ఈ రేసులో పెరెజ్‌ 64 ల్యాప్‌ల రేసును అందరికంటే వేగంగా గంటా 56 నిమిషాల 30.265 సెకన్లలో ముగించి ఈ సీజన్‌లో తొలి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.

వర్షం కారణంగా 77 ల్యాప్‌ల రేసును 64 ల్యాప్‌లకు కుదించారు. కార్లోస్‌ సెయింజ్‌ (ఫెరారీ) రెండో స్థానంలో, వెర్‌స్టాపెన్‌ (రెడ్‌బుల్‌) మూడో స్థానంలో నిలిచారు. ‘పోల్‌ పొజిషన్‌’తో రేసును ఆరంభించిన ఫెరారీ డ్రైవర్‌ లెక్‌లెర్క్‌ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ముగ్గురు డ్రైవర్లు అల్బోన్‌ (విలియమ్స్‌ రేసింగ్‌), మిక్‌ షుమాకర్‌ (హాస్‌), మాగ్నుసన్‌ (హాస్‌) రేసును పూర్తి చేయలేకపోయారు. తదుపరి రేసు అజర్‌బైజాన్‌ గ్రాండ్‌ప్రి జూన్‌ 12న జరుగుతుంది. 

చదవండి: Chamundeswaranath: నిఖత్‌ జరీన్‌కు బహుమతిగా కారు

మరిన్ని వార్తలు