ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ పేజీని తొలగించిన ఫేస్‌బుక్‌

7 Nov, 2020 06:06 IST|Sakshi

న్యూఢిల్లీ: అంతర్జాతీయ షూటింగ్‌ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్‌)కు ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌ షాక్‌ ఇచ్చింది. ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ అధికార పేజీని తొలగిస్తూ ఫేస్‌బుక్‌ నిర్ణయం తీసుకుంది. దాంతో ఆగ్రహించిన ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ‘అన్‌బ్లాక్‌ ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ఫేస్‌బుక్‌’ హ్యాష్‌ ట్యాగ్‌తో ఇతర సామాజిక మాధ్యమాలు ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో మద్దతు ఇవ్వాలని కోరింది. ఐఎస్‌ఎస్‌ఎఫ్‌కు మద్దతుగా పలువురు షూటర్లు కూడా ఈ ట్యాగ్‌కు తమ కామెంట్లను జత చేశారు.

‘ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ చరిత్రలో గురువారం ఒక దురదృష్టకరమైన రోజు. ఎటువంటి కారణం, ముందస్తు హెచ్చరిక లేకుండానే ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ పేజీని ఫేస్‌బుక్‌ తొలగించింది’ అని ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. 2010 జనవరి 14న ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ఫేస్‌బుక్‌లో చేరింది. తొలగించడానికి సరైన కారణం తెలియకపోయినా... ఫేస్‌బుక్‌ నిబంధనల ప్రకారం రైఫిళ్లు, హ్యాండ్‌గన్‌లకు సంబంధించిన వాటి ప్రచారాన్ని తమ ఫేస్‌బుక్‌ ద్వారా చేయకూడదు. ఈ కారణంతోనే ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ పేజీని ఫేస్‌బుక్‌ తొలగించినట్లు సమాచారం.

>
మరిన్ని వార్తలు