ధోనీ, కోహ్లీ, సర్ఫరాజ్‌ కెప్టెన్సీలపై స్పందించిన సఫారీ మాజీ కెప్టెన్‌

6 Jun, 2021 18:58 IST|Sakshi

కరాచీ: జట్టును ముందుండి నడిపించడంలో పాక్‌ మాజీ సారధి సర్ఫరాజ్‌ అహ్మద్‌, టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ స్టైల్‌ ఒకేలా ఉంటుందని దక్షిణాఫ్రికా మాజీ సారథి ఫాఫ్ డుప్లెసిస్‌ అభిప్రాయపడ్డాడు. అయితే, ఈ విషయంలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ స్టైల్‌ వాళ్లిద్దరికి పూర్తి భిన్నంగా ఉంటుందని ఆయన పేర్కొన్నాడు. జూన్‌ 9 నుంచి ప్రారంభంకానున్న పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్ఎల్)లో పాల్గొనేందుకు పాక్‌ చేరుకున్న డుప్లెసిస్‌.. శనివారం పాక్‌ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశాడు. పీఎస్‌ఎల్‌లో సర్ఫరాజ్ సారథ్యంలోని క్వెట్టా గ్లాడియేటర్స్‌ తరఫున ఆడుతున్న డుప్లెసిస్‌.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో ధోనీ కెప్టెన్సీలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.

కాగా, ధోనీ, సర్ఫరాజ్‌ల కెప్టెన్సీలను పోల్చే క్రమంలో కోహ్లీ సారథ్యం గురించి ఆయన మాట్లాడుతూ.. సర్ఫరాజ్‌ కూడా కోహ్లీలాగే మైదానంలో దూకుడుగా ఉంటాడని, ప్రతి ఒక్క ఆటగాడితో క్రమం తప్పకుండా మాట్లాడి వాళ్ల అభిప్రాయాలు తెలుసుకుంటాడని, ముఖ్యంగా బౌలర్లతో ప్రతి బంతికి ముందు, తర్వాత సంభాషిస్తాడని పేర్కొన్నాడు. ఈ విషయంలో ధోనీ స్టైల్‌ డిఫరెంట్‌గా ఉంటుందని, ఆయన మైదానంలో కూల్‌గా, రిజర్వ్‌డ్‌గా ఉంటాడని, సందర్భానుసారంగా నిర్ణయాలు తీసుకోవడంలో ధోనీ తరవాతే ఎవరైనా అని డుప్లెసిస్‌ చెప్పుకొచ్చాడు. అయితే జట్టును నడిపించడంలో ఎవరి శైలి వారికుంటుందని, ఈ విషయంలో ఒకరితో ఒకరిని పోల్చలేమని ఆయన పేర్కొన్నాడు.

వ్యక్తిగతంగా తనకు వివిధ కెప్టెన్లతో కలిసి ఆడాలని ఉంటుందని, వాళ్లంతా తమ జట్లను ఎలా నడిపిస్తారో చూడాలని ఉంటుందని ఈ దక్షిణాఫ్రికా మాజీ సారథి తెలిపాడు. తనకు మొదటి నుంచి కెప్టెన్సీ అంటే మక్కువని, దక్షిణాఫ్రికా జట్టుకు సారధ్యం వహించడం ద్వారా తన కల నెరవేరిందని వెల్లడించాడు. సర్ఫరాజ్‌ సారథ్యంలో ఆడటాన్ని ఆస్వాధిస్తానని, అవసరమైతే అతనికి సలహాలు, సూచనలు చేస్తానని తెలిపాడు. ఐపీఎల్‌ 14వ సీజన్‌లో సీఎస్‌కే తరఫున ఆడిన ఫాఫ్.. 7 మ్యాచ్‌ల్లో 320 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్ధసెంచరీలు ఉన్నాయి. అయితే భారత్‌లో కరోనా కేసులు అధికమవడం కారణంగా ఐపీఎల్‌ అర్ధంతరంగా రద్దు కావడంతో మిగిలిన మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.
చదవండి: అశ్విన్‌ ఆల్‌టైమ్‌ గ్రేట్‌ స్పిన్నర్‌ అంటే ఒప్పుకోను..
 

మరిన్ని వార్తలు