నన్ను, నా భార్యను చంపుతామని బెదిరించారు: డుప్లెసిస్‌

19 May, 2021 15:27 IST|Sakshi

జోహన్నస్‌బర్గ్‌: ‘‘నన్ను, నా భార్యను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. సోషల్‌ మీడియా ఓపెన్‌ చేయగానే ఘోరమైన విమర్శలు. శ్రుతిమీరిన కామెంట్లు. మళ్లీ ఇలా ఆడితే పరిస్థితి దారుణంగా ఉంటుందంటూ హెచ్చరికలు వచ్చాయి’’ అంటూ దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ 2011 నాటి చేదు జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నాడు. వన్డే వరల్డ్‌కప్‌-2011లో భాగంగా బంగ్లాదేశ్‌లోని ఢాకాలో సౌతాఫ్రికా- న్యూజిలాండ్‌ మధ్య మూడో క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. 

తొలుత బ్యాటింగ్‌ చేసిన డేనియల్‌ వెటోరి సారథ్యంలోని కివీస్‌ జట్టు నిర్దిష్ట 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసి ప్రొటిస్‌ టీమ్‌కు సవాల్‌ విసిరింది.  అయితే లక్ష్యఛేదనలో తడబడ్డ దక్షిణాఫ్రికా 172 పరుగులకే చేతులెత్తేసి భారీ పరాజయం మూటగట్టుకుంది. 121 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో ఏబీ డివిలియర్స్‌ రనౌట్‌ కావడంతో పరిస్థితి దిగజారింది. మేజర్‌ టోర్నీలో న్యూజిలాండ్‌ ముందు తలవంచకతప్పలేదు. అంతేకాదు, డుప్లెసిస్‌, కివీస్‌ పన్నెండో ఆటగాడు కైల్‌ మిల్స్‌ను నెట్టివేయడం విమర్శలకు దారి తీసింది. అతడి మ్యాచ్‌ ఫీజులో 50 శాతం కోత కూడా పడింది. 

ఈ విషయాలను గుర్తు చేసుకున్న డుప్లెసిస్‌ తాజాగా ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ.. ‘‘ప్రపంచకప్‌ నుంచి మా జట్టు నిష్క్రమించగానే విమర్శల జడి కురిసింది. కొంతమందైతే ఏకంగా చంపేస్తామంటూ బెదిరించారు. ఇలాంటి పరిణామాలు మనసును కుంగదీస్తాయి. ప్రతి ఒక్క ఆటగాడి జీవితంలో ఇలాంటివి సహజం.  కానీ, కఠినంగా శ్రమిస్తే తప్పకుండా సత్ఫలితాలు పొందగలం. నేనూ అదే చేశాను’’ అని చెప్పుకొచ్చాడు. ఇక ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న డుప్లెసిస్‌.. టోర్నీ వాయిదా పడటంతో స్వదేశానికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో ఆడిన 7 మ్యాచ్‌లలో అతడు 320 పరుగులు చేసి సత్తా చాటాడు.

చదవండి: ఇండియాకు వచ్చెయ్‌ ప్లీజ్‌ .. పంత్‌​ స్థానంలో ఆడు

మరిన్ని వార్తలు