IPL 2022 Mega Auction: వేలంలో అత‌డికి ఏకంగా రూ.11 కోట్లు.. అయ్య‌ర్‌కి మ‌రీ ఇంత త‌క్కువా!

3 Feb, 2022 11:30 IST|Sakshi
PC: IPL

ఐపీఎల్-2022 మెగా వేలంకు స‌మయం ద‌గ్గ‌ర‌ప‌డుతుంది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరులో ఐపీఎల్ మెగా వేలాన్ని బీసీసీఐ నిర్వ‌హించ‌నుంది. ఇప్పటికే పాత జట్లు రిటెన్షన్ ప్రక్రియను పూర్తి చేయగా.. కొత్తగా వచ్చిన రెండు జట్లు కూడా ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నాయి. ఇక ఈ మెగా వేలంలో 590 మంది క్రికెట‌ర్లు పాల్గొన‌బోతున్నారు. వేలంలో పాల్గొనే ఆట‌గాళ్ల జాబితాను బీసీసీఐ ప్ర‌క‌టించింది.

ఇక రానున్న మెగా వేలంలో ద‌క్షిణాఫ్రికా స్టార్ ఆట‌గాడు ఫాఫ్ డు ప్లెసిస్‌కి అత్య‌ధిక ధ‌ర ద‌క్క‌నుంద‌ని మాజీ ఆస్ట్రేలియా స్పిన్నర్ బ్రాడ్ హాగ్ అభిప్రాడ్డాడు. ఆర్సీబీ, కేకేఆర్‌,పంజాబ్ కింగ్స్‌, సీఎస్కే అత‌డి కోసం పోటీ ప‌డ‌తాయి అని హాగ్ అంచ‌నా వేశాడు. ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు చెన్నై సూప‌ర్ కింగ్స్  డు ప్లెసిస్‌ను రీటైన్ చేసుకోలేదు. కాగా ఐపీఎల్‌- 2021లో చెన్నై టైటిల్ గెల‌వ‌డంలో డు ప్లెసిస్ కీల‌క పాత్ర పోషించాడు.

"డు ప్లెసిస్ తన నాయకత్వ ల‌క్ష‌ణాల  కారణంగా వేలంలో అత‌డికి భారీ ధ‌ర ద‌క్క‌నుంది. అత‌డిని ద‌క్కించుకోవ‌డానికి ఆర్సీబీ, కేకేఆర్‌, పంజాబ్ కింగ్స్‌, సీఎస్కే జ‌ట్లు పోటీ ప‌డ‌తాయి. అత‌డు ఓపెన‌ర్‌గా అద్భుతంగా రాణించ‌గ‌ల‌డు. కాగా అత‌డికి గ‌తేడాది 7 కోట్లకు చెన్నై అంటి పెట్టుకుంది. కానీ ఈ సారి అత‌డికి ఏకంగా రూ. 11 కోట్లు ద‌క్కే అవ‌కాశం ఉంది.

అదే విధంగా శ్రేయ‌స్ అయ్య‌ర్‌, కగిసో రబడ, మహ్మద్ షమీ వంటి స్టార్ ఆట‌గాళ్ల కోసం ఆర్సీబీ, కేకేఆర్‌, పంజాబ్ కింగ్స్ పోటీ ప‌డ‌తాయి. అయ్య‌ర్‌కి ఐపీఎల్‌లో కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం ఉంది. కాబ‌ట్టి అతడిని ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ ద‌క్కించుకోనే అవ‌కాశాలు ఉన్నాయి. అత‌డిని రూ. 4 కోట్ల‌కు కొనుగోలు చేసే అవ‌కాశం ఉంది. ఇక ష‌మీ, ర‌బ‌డాకి కూడా 4 నుంచి 5 కోట్ల మ‌ధ్య ద‌క్కే అవ‌కాశం ఉంది" అని హాగ్ యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు.

చ‌ద‌వండి: సెమీఫైన‌ల్లో సెంచ‌రీతో చెల‌రేగాడు.. భార‌త్‌ను ఫైన‌ల్‌కు చేర్చాడు.. ద‌టీజ్ యష్ ధుల్!

మరిన్ని వార్తలు