Fake IPL SCAM: గుజరాత్‌లో 'ఆట' రష్యా నుంచి డబ్బుల 'మూట'.. బయటపడ్డ ఫేక్‌ ఐపీఎల్‌ బండారం

14 Jul, 2022 14:33 IST|Sakshi

గ్రౌండ్‌లో ఐపీఎల్‌ టీ20 క్రికెట్‌ మ్యాచ్‌ జరుగుతోంది. ఆటగాళ్లంతా మంచి ఉత్సాహంతో ఉన్నారు. ఓ వైపు బ్యాట్స్‌మన్‌ ఫోర్లు, సిక్సర్లు బాదుతుంటే.. మరో వైపు బౌలర్లు వికెట్లు పడగొట్టేస్తున్నారు.. లైవ్‌లో ప్రేక్షకులు ఊపిరిబిగపట్టుకుని చూస్తున్నారు. అటు మ్యాచ్‌లో ఏ ఓవర్‌లో ఎన్ని రన్స్‌ రావొచ్చన్న దాని నుంచి ఫోర్లు, సిక్సర్లు, ఔట్‌లు, ఎవరెంత స్కోర్‌ చేస్తారనే దాకా బెట్టింగ్‌ల మీద బెట్టింగ్‌లు సాగుతున్నాయి. క్రికెట్‌ అన్నాక ఇదంతా కామనే అంటారు కదా.. ఇందులో చివరన చెప్పిన బెట్టింగులు మాత్రమే నిజం. మిగతా అంతా ఉత్త ఫేక్‌! విదేశీయులతో బెట్టింగ్‌లు కాయించి డబ్బులు దండుకోవడానికి ఓ ముఠా ఏకంగా ఫేక్‌ ఐపీఎల్‌నే నడిపించింది. ఇటీవలే గుజరాత్‌ పోలీసులు ఈ ఫేక్‌ ఐపీఎల్‌ మ్యాచులు, బెట్టింగ్‌ దందాను బయటపెట్టారు. 

అచ్చం ఐపీఎల్‌ మ్యాచ్‌లను తలపించేలా..
కొందరు గుజరాత్‌లోని మెహ్సానా పట్టణానికి కాస్త దూరంలోని మోలిపూర్‌ గ్రామంలో శ్మశానం పక్కన ఓ పొలాన్ని నెలవారీ అద్దెకు తీసుకున్నారు. దాన్ని చదును చేసి.. మధ్యలో పిచ్‌ను, ఇతర గుర్తులను సిద్ధం చేసి ఓ క్రికెట్‌ గ్రౌండ్‌లా మార్చారు. స్థానికంగా ఉన్న 25 మంది రైతులు, కూలీలకు రోజుకు రూ. నాలుగైదు వందలు ఇస్తామని చెప్పి క్రికెట్‌ ఆటగాళ్లుగా పెట్టుకున్నారు. అచ్చం ఐపీఎల్‌ టోర్నీలో వివిధ జట్లను పోలిన డ్రెస్‌లను వేయించి.. ఆయా జట్ల మధ్య మ్యాచ్‌లు జరుగుతున్న ట్టుగా హడావుడి చేశారు.

అంపైర్లను పెట్టి, వారికి వాకీటాకీలు ఇచ్చి.. నిజమైన మ్యాచ్‌ను తలపించేలా చేశారు. దీనంతటినీ అధునాతన కెమెరాలతో చిత్రీకరిస్తూ.. ‘ఐపీఎల్‌’ పేరిట క్రియేట్‌ చేసిన యూట్యూబ్‌లో చానల్‌లో లైవ్‌ ప్రసారం చేశారు. నిజమైన మ్యాచ్‌ల తరహాలో స్కోర్, బాల్స్, ఇతర గ్రాఫిక్స్‌ను పెట్టి.. నిజంగానే ఏదో పెద్ద ఆటగాళ్ల లైవ్‌ మ్యాచ్‌ అనిపించేలా జాగ్రత్త తీసుకున్నారు. ప్రేక్షకుల గోల, ఈలలు, చప్పట్లు వినిపించేలా సౌండ్‌ను ఇంటర్నెట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని లైవ్‌కు యాడ్‌ చేశారు. ప్రఖ్యాత క్రికెట్‌ కామెంటేటర్‌ ‘హర్ష భోగ్లే’ వాయిస్‌ను పోలినట్టుగా ఓ వ్యక్తితో కామెంట్‌ కూడా చెప్పించారు.

ఇదంతా ఎందుకోసం..?
ముందే చెప్పుకున్నట్టు ఈ మ్యాచ్‌లు, ఆటగాళ్లు అంతా ఫేక్‌ అయినా.. ఇదంతా చేసింది మాత్రం బెట్టింగ్‌ కోసం. మన దేశం వాళ్లయితే ఆటగాళ్లను, మ్యాచ్‌ను ఇట్టే గుర్తుపట్టేస్తారు కాబట్టి.. రష్యాలో బెట్టింగ్‌లు నిర్వహించారు. దీనికి ప్లాన్‌ వేసింది కూడా రష్యాలోని పబ్‌లు, బార్లలో బెట్టింగ్‌లు నిర్వహించే ఆసిఫ్‌ మొహమ్మద్‌ అనే వ్యక్తి, ఆ పబ్‌లలో పనిచేసి తిరిగి వచ్చిన షోయబ్‌ దావ్డా అనే గుజరాతీ వ్యక్తి. వాళ్లు ఇక్కడ ఫేక్‌ ఐపీఎల్‌ నిర్వహిస్తూ.. నిజమైన మ్యాచ్‌ల్లా కలరింగ్‌ ఇస్తూ పందాలు కాశారు. వచ్చిన బెట్టింగ్‌లకు అనుగుణంగా.. మ్యాచ్‌లో ఫోర్లు, సిక్సర్లు కొట్టిస్తూ.. ఔట్‌ చేయిస్తూ.. కావాల్సిన టీమ్‌ను గెలిపించుకుంటూ.. డబ్బులు దండుకున్నారు. చిత్రమేంటంటే మొత్తం ఉన్నది 25 మందే. కానీ చాలా టీమ్‌లు ఆడినట్టుగా... వారికే వేర్వేరు టీమ్‌ల డ్రెస్‌లు వేయిస్తూ, మార్చుతూ ఆడుతున్నట్టుగా నటింపజేశారు.

ఎలా బయటపడింది?
తమ ఊరిలో పెద్ద పెద్ద క్రికెట్‌ మ్యాచ్‌లు జరుగుతు న్నాయని మోలిపూర్‌ వాసులు చర్చించుకోవడం.. ఆ నోటా ఈ నోటా ఈ విషయం మెహ్సానా పోలీసులకు చేరడం జరిగిపోయింది. ఓ పల్లెటూరిలో, అదీ తమకు తెలియకుండా మ్యాచ్‌లు ఏమిటని పోలీసులు ఆరా తీయడంతో.. ఫేక్‌ ఐపీఎల్, బెట్టింగ్‌ దందా గుట్టు బయటపడింది. ఈ వ్యవహారంలో పోలీసులు షోయబ్‌ దావ్డా సహా నలుగురిని అరెస్టు చేసి కేసు పెట్టారు. ఇంతా చేసి పోలీసులు స్వాధీనం చేసుకున్న క్రికెట్‌ కిట్లు, జనరేటర్లు, ఐదు వీడియో కెమెరాలు, లైట్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు, మైక్రోఫోన్లు, వాకీటాకీలన్నీ కలిపి విలువ అంతా నాలుగు లక్షలలోపే కావడం గమనార్హం.

మరిన్ని వార్తలు