Commonwealth Games 2022: హిమ దాస్‌ స్వర్ణం గెలవలే.. నెట్టింట వైరలవుతున్న ఫేక్‌ ట్వీట్‌

30 Jul, 2022 17:29 IST|Sakshi

బర్మింగ్‌హామ్‌ వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో భారత స్టార్‌ అథ్లెట్‌ హిమ దాస్‌ స్వర్ణ పతకం (400 మీటర్ల పరుగు పందెం) నెగ్గిందన్న వార్త కొద్దిసేపటి క్రితం నెట్టింట హల్‌చల్‌ చేసింది. హిమ స్వర్ణం గెలిచిందన్న ఆనందంలో చాలామంది భారతీయులు ఆమెకు రకరకాల సోషల్‌ మీడియా మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ వార్త ఫేక్‌ అని తేలడంతో వారంతా నాలుక్కరచుకుని తమ పోస్ట్‌లను డిలీట్‌ చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఇలా చేసిన వారిలో మాజీ డాషింగ్‌ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ లాంటి చాలామంది ప్రముఖులు ఉన్నారు. 

సరైన ఫాలో అప్‌ లేక ఇలాంటి ఫేక్‌ సమాచారాన్ని ప్రచారం చేసినందుకు గాను వారంతా పశ్చాత్తాప పడుతున్నారు. అసలు కామన్‌వెల్త్‌ క్రీడల్లో ఇవాళ (జులై 30) హిమ దాస్‌ ఈవెంటే లేకపోవడం ఓ విషయమైతే.. హిమ స్వర్ణం​ నెగ్గినట్లు చెబుతున్న 400 మీటర్ల రేసులో ఆమె పాల్గొనకపోవడం మరో విశేషం. ఇదిలా ఉంటే, కామన్‌వెల్త్‌ క్రీడల్లో ఇవాళ భారత్‌ బోణీ కొట్టింది. పురుషుల వెయిట్‌ లిఫ్టింగ్‌ ‌55 కేజీల విభాగంలో సంకేత్‌ సర్గార్‌ రజత పతకం సాధించి భారత్‌కు తొలి పతకం అందించాడు. 


చదవండి: CWG 2022: బోణీ కొట్టిన భారత్‌.. వెయిట్‌ లిఫ్టింగ్‌లో తొలి పతకం

మరిన్ని వార్తలు