ధోనిపై అభిమానంతో ఇంటిని మార్చేశాడు

14 Oct, 2020 14:16 IST|Sakshi

ధోనిపై విమర్శలకు, ఫ్యాన్‌ సమాధానం

చెన్నై: మూడు ఐసీసీ టోర్నీల్లో విజేతగా నిలిపి భారత క్రికెట్‌ టీమ్‌ను అత్యున్నత శిఖరాలకు చేర్చిన మహేంద్రసింగ్‌ ధోనికి భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఆటగాడిగానే కాకుండా వ్యక్తిత్వ పరంగా కూడా ఆయనకు మంచి పేరుంది. మైదానంలోనూ మిస్టర్‌ కూల్‌గా వ్యవహరించి జట్టును ముందుండి నడిపిస్తాడు. అయితే, ఐపీఎల్‌ తాజా సీజన్‌లో ధోని టీమ్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ అంతగా రాణించడం లేదు. ఎనిమిది మ్యాచ్‌లాడిన చెన్నై మూడిండిలో విజయం సాధించింది. ముఖ్యంగా ధోని బ్యాట్‌ నుంచి పరుగులు రావడం కష్టమైపోయింది. గేమ్‌ ఫినిషర్‌గా టీమిండియాకు ఎన్నో విజయాలు అందించిన ధోని ఈ మధ్య కాలంలో అలా ఆడలేకపోతున్నాడు. దానికి తోడు కెప్టెన్‌గా అతడి నిర్ణయాలపై విమర్శలు వస్తున్నాయి. ఫామ్‌లేని ఆటగాళ్లకు అవకాశమిస్తారని కొందరు విమర్శిస్తున్నారు. 
(చదవండి: ఏందిది.. ధోనికి అంపైర్‌ భయపడ్డాడా?)

మొన్న ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 10 ఓవర్లలో 79 పరుగులు చేయాల్సిన స్థితిలో కేదార్‌ జాదవ్‌, ధోని డాట్‌ బాల్స్‌ ఎక్కువ ఆటడంతో జట్టుకు విజయం దూరమైంది. టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ వంటివారు కూడా కెప్టెన్‌గా తన నిర్ణయాలను ధోని పరిశీలించుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో తమిళనాడుకు ధోని వీరాభిమాని గోపీ కృష్ణన్‌ వినూత్నంగా ఆలోచించాడు. తన ఇంటి మొత్తానికి పసుపు పచ్చ రంగులేసి చెన్నై సూపర్‌ కింగ్స్‌పై అభిమానం చాటుకున్నాడు. కడలూర్‌ ప్రాంతం, అరంగూర్‌లో తన ఇంటికి ‘ఇది ధోని ఫ్యాన్‌ ఇల్లు’అని పెద్ద పెద్ద అక్షరాలతో రాసుకున్నాడు. ఇంటి గోడలన్నీ ధోని ఫొటోలతో నింపేశాడు. అదే సమయంలో ధోని విమర్శకులపై మండిపడ్డాడు. టీమిండియాకు ఆయన చేసిన సేవలను మరచి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. వారికి ధోని గొప్పదనం తెలియజెప్పేందుకే ఇలా చేశానని గోపీ కృష్ణన్‌ వెల్లడించాడు.
(చదవండి: ‘సన్‌’కు చెన్నై చెక్‌... )

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు