Virat Kohli: 71 కాస్తా 74.. మూడేళ్ల శపథం నుంచి పెళ్లి వరకు

17 Jan, 2023 13:30 IST|Sakshi

టీమిండియా సూపర్‌స్టార్‌.. కింగ్‌ కోహ్లి ఈ ఏడాదిని అద్భుతంగా ఆరంభించాడు. కొత్త ఏడాది ప్రారంభమైన రెండు వారాల వ్యవధిలోనే రెండు శతకాలు కొట్టి తన ఫామ్‌ను కొనసాగించాడు. 74వ సెంచరీతో.. శతకాల వేట కొనసాగిస్తున్న కోహ్లి.. ఈ ఏడాది స్వదేశంలో జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌లోనూ ఇదే ఫామ్‌ను కంటిన్యూ చేసి కప్‌ను అందుకోవాలని కోరుకుందాం.

అయితే గడిచిన మూడేళ్లు కోహ్లికి గడ్డుకాలం. 2019లో చివరిసారి సెంచరీ సాధించిన కోహ్లి.. మూడేళ్ల పాటు ఒక్క సెంచరీ అందుకోలేకపోయాడు. ఒకానక దశలో సెంచరీ కాదు కదా కనీసం అ‍ర్థ సెంచరీ మార్క్‌ అందుకోవడంలోనూ విఫలం కావడంతో అతని ఆటపై సందేహాలు నెలకొన్నాయి.కోహ్లి తప్పుకోవాల్సిన సమయం వచ్చేసిందంటూ విమర్శనాస్రాలు సంధించారు. ఇక కోహ్లి అభిమానులైతే అతని సెంచరీ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూశారు.

ఆ అభిమానం ఎంతదూరం వెళ్లిదంటే.. కొంతమంది అభిమానులు కోహ్లి సెంచరీ కొట్టేవరకు తమ టూర్లను వాయిదా వేసుకోవడం.. లేదంటే గడ్డం చేసుకోకపోవడం.. గర్ల్‌ఫ్రెండ్స్‌తో డేట్‌కు వెళ్లమని శపథాలు చేశారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరొక అభిమాని చర్య విపరీతంగా వైరల్‌ అయింది. కోహ్లి 71వ సెంచరీ(మూడు ఫార్మాట్లు కలిపి) చేసేవరకు తాను పెళ్లి చేసుకోనంటూ సదరు అభిమాని టీమిండియా మ్యాచ్‌ సందర్భంగా మైదానంలో ప్లకార్డు పట్టుకొని కనిపించాడు. అన్నట్లుగానే కోహ్లి సెంచరీ సాధించేవరకు పెళ్లి చేసుకోలేదు. అయితే గతేడాది ఆసియాకప్‌ సందర్భంగా అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో కోహ్లి 71వ సెంచరీ  అందుకున్నాడు. దీంతో అభిమాని కల నెరవేరినప్పటికి పెళ్లికి ముహుర్తాలు లేకపోవడంతో నాలుగు నెలలు ఆగాల్సి వచ్చింది.

అయితే ఈ గ్యాప్‌లోనే కోహ్లి మరో రెండు సెంచరీలు బాది ఆ సంఖ్యను 74కు పెంచుకున్నాడు.యాదృశ్చికంగా కోహ్లి 74వ సెంచరీ కొట్టిన రోజునే సదరు అభిమాని వివాహం జరిగింది. ఇంకేముంది తన అభిమాని ఆటగాడు సెంచరీ చేసిన రోజునే తన పెళ్లి కూడా జరగడంతో అతని ఆనందానికి అవదులు లేకుండా పోయాయి. అందుకే పెళ్లి తంతు ముగియగానే అదే పెళ్లి బట్టల్లో సరాసరి ఇంటికి వచ్చి కోహ్లి సెంచరీ ఫీట్‌ను టీవీలో చూస్తూ పరవశించిపోయాడు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆ వ్యక్తి ట్విటర్‌లో షేర్‌ చేయడంతో తెగ వైరల్‌ అయ్యాయి.

ఇక కోహ్లి శ్రీలంకతో వన్డే సిరీస్‌లోనే రెండు సెంచరీలు బాది ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచాడు. ఇప్పటివరకు వన్డేల్లో కోహ్లి 46 సెంచరీలు బాదాడు. సచిన్‌ 49 వన్డే సెంచరీల రికార్డును బద్దలు కొట్టడానికి కేవలం మూడు సెంచరీల దూరంలో మాత్రమే ఉన్నాడు. కోహ్లి ఇప్పుడున్న ఫామ్‌ దృశ్యా అది పెద్ద కష్టమేమి అనిపించడం లేదు. ఇక న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ ప్రారంభం కానున్న దృశ్యా కోహ్లి మరో సెంచరీ చేస్తాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇరుజట్ల మధ్య బుధవారం(జనవరి 18న) ఉప్పల్‌ వేదికగా తొలి వన్డే జరగనుంది. ఉప్పల్‌ మైదానంలో కోహ్లికి ఘనమైన రికార్డు ఉంది. గతేడాది సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాతో ఉప్పల్‌లో జరిగిన టి20 మ్యాచ్‌లో కోహ్లి (63 పరుగులు) అర్థసెంచరీతో రాణించాడు.

చదవండి: షార్ట్‌ టెంపర్‌కు మారుపేరు.. అభిమానిపై తిట్ల దండకం

న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. సూర్యకుమార్‌కు నో ఛాన్స్‌! కిషన్‌కు చోటు

>
మరిన్ని వార్తలు