Babar Azam: నిబంధనను పాతరేసిన పాక్‌ కెప్టెన్‌.. యాక్షన్‌ తీసుకోవాల్సిందే!

23 Mar, 2022 15:58 IST|Sakshi

పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం ఐసీసీ నిబంధన అతిక్రమించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో రెండో రోజు ఆటలో బాబర్‌ ఆజం బంతికి లాలాజలం రుద్దాడు. క్రికెట్‌లో బంతి షైన్‌ కోసం ఆటగాళ్లు సలైవా ఉపయోగించకూడదని కోవిడ్‌-19 సీరియస్‌గా ఉన్న సమయంలో ఐసీసీ పేర్కొంది. బాబర్ ఆజం మాత్రం  నిబంధనను గాలికి వదిలేసి బంతికి లాలాజలం రుద్దుతూ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయాడు. ఇది చూసిన క్రికెట్‌ ఫ్యాన్స్‌ బాబర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్‌ కెప్టెన్‌ చేసింది ముమ్మాటికి తప్పేనని.. బంతికి లాలాజలం రుద్దకూడదని తెలిసినా.. అది పట్టించుకోకుండా తన పని చేసుకుపోయాడు. దీనిపై ఐసీసీ అపెక్స్‌ కౌన్సిల్‌ సీరియస్‌ యాక్షన్‌ తీసుకోవాల్సిందనని అభిమానులు పేర్కొన్నారు.

ఇటీవలే బంతికి సలైవాను రుద్దడాన్ని బ్యాన్‌ చేస్తూ ఎంసీసీ(మెరిల్‌బోర్న్‌ క్రికెట్‌ అసొసియేషన్‌) నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి కోవిడ్‌-19ను దృష్టిలో ఉంచుకొని అంతకముందే ఐసీసీ బంతికి లాలాజలం రుద్దడాన్ని తాత్కాలికంగా నిషేధించింది. దీనికి సంబంధించిన గైడ్‌లైన్స్‌ను కూడా ఐసీసీ అప్పట్లో విడుదల చేసింది. ఐసీసీ మార్గదర్శకాల ప్రకారం బంతికి ఉమ్మి రుద్దడం తప్పుగా పరిగణించింది. ఆ తర్వాత మెరిల్‌బోర్న్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ సలైవా విషయంలో​కొత్త సవరణ తీసుకొచ్చింది. బంతి షైన్‌ కోసం బౌలర్‌ లేదా ఆటగాళ్లు లాలాజలం రుద్దడం నిషేధమని... అలా చేస్తే బంతి షేప్‌ మార్చినట్లే అవుతుందని పేర్కొంది. అందుకే సలైవాను బ్యాన్‌ చేస్తున్నట్లు తెలిపింది.  వచ్చే అక్టోబర్‌ నుంచి ఈ రూల్‌ అమల్లోకి రానుందని ఎంసీసీ పేర్కొంది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. మూడోరోజు బ్యాటింగ్‌ చేస్తున్న పాకిస్తాన్‌ ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. బాబర్‌ ఆజం 45, పవాద్‌ ఆలమ్‌ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 391 పరుగులకు ఆలౌట్‌ అయింది.

చదవండి: PAK vs AUS: బాబర్ ఆజం.. కేవలం రికార్డుల కోసమే టెస్టు సిరీస్‌​ ఆడుతున్నావా?

IPL 2022: ఐపీఎల్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌

మరిన్ని వార్తలు