కరోనా బారిన పడ్డా.. కోహ్లి చేసింది కరెక్టేనా!

23 Jun, 2022 07:41 IST|Sakshi

లీసెస్టర్‌: ఇంగ్లండ్‌ పర్యటనకు ముందు లభించిన విరామంలో భారత క్రికెటర్లు కరోనాకు చేరువైనట్లున్నారు! ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ తరహాలోనే టాప్‌ బ్యాటర్, మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి కూడా కోవిడ్‌ పాజిటివ్‌గా తేలాడు. ఈ విషయం ఆలస్యంగా బయటపడింది. ఐపీఎల్‌ ముగిసిన తర్వాత కోహ్లి తన కుటుంబంతో కలిసి మాల్దీవుల విహారానికి వెళ్లాడు. అక్కడి నుంచి రాగానే అతనికి కరోనా సోకింది. అయితే సరైన సమయంలో అతను కోలుకున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. అందువల్లే అశ్విన్‌లాగా భారత్‌లోనే ఉండిపోకుండా కోహ్లి ఇంగ్లండ్‌కు బయల్దేరి వెళ్లాడు.

‘మాల్దీవుల నుంచి తిరిగొచ్చిన తర్వాతే కోహ్లికి కరోనా సోకింది. అయితే కోలుకోవడంతో జట్టుతో కలిసి వచ్చాడు. ప్రస్తుతం బాగానే ఉన్నా వైద్యసూచనల ప్రకారం చూస్తే కోహ్లికి మరింత విశ్రాంతి అవసరం. అందుకే ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో అతడు ఆడతాడా లేదా అనేది చెప్పలేం. అశ్విన్, కోహ్లి మాత్రమే కాకుండా జట్టులో మరికొందరు కూడా కోవిడ్‌ బాధితులు ఉండవచ్చు. అలా చూస్తే ఆశించినంత స్థాయిలో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో తీవ్రత ఉండకపోవచ్చు’ అని ఆయన వెల్లడించారు. నేటినుంచి నాలుగు రోజుల పాటు జరిగే మ్యాచ్‌లో లీసెస్టర్‌షైర్‌ కౌంటీతో భారత జట్టు తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో భారత క్రికెటర్లు పుజారా, పంత్, బుమ్రా, ప్రసిధ్‌ కృష్ణ లీసెస్టర్‌షైర్‌ కౌంటీ జట్టు తరఫున బరిలోకి దిగనున్నారు.  ప్రాక్టీస్‌ మ్యాచ్‌: మధ్యాహ్నం 3 గంటల నుంచి లీసెస్టర్‌షైర్‌ కౌంటీ అఫీషియల్‌ యూట్యూబ్‌ చానల్‌ ‘ఫాక్సెస్‌ టీవీ’లో ప్రత్యక్ష ప్రసారం. 

చదవండి: 'ఆ క్రికెటర్‌ యువ ఆటగాళ్లకు ఒక గుణపాఠం.. చూసి నేర్చుకొండి'

మరిన్ని వార్తలు