NEP Vs UAE: క్రికెట్‌పై అభిమానం.. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా

16 Mar, 2023 18:15 IST|Sakshi

క్రికెట్‌ అయినా.. సినిమా అయినా అభిమానం ఎప్పుడు తారాస్థాయిలో ఉంటుంది. తమకు నచ్చిన మ్యాచ్‌ లేదా సినిమా నటుడిని చూడడానికి ఎంతవరకైనా వెళ్తారు. తాజాగా నేపాల్‌లో క్రికెట్‌పై అభిమానం గణనీయంగా పెరిగిందని చెప్పొచ్చు. ఎంతలా అంటే ఒక మ్యాచ్‌ చూడడం కోసం అక్కడి ఫ్యాన్స్‌ ప్రాణానికి ప్రమాదం అని తెలిసినా లెక్క చేయకుండా ఏకంగా చెట్లు ఎక్కి మరీ మ్యాచ్‌లు వీక్షిస్తున్నారు. ఐసీసీ క్రికెట్‌ వరల్డ్‌కప్‌ లీగ్‌-2(2019-23)లో భాగంగా గురువారం నేపాల్‌లోని కిర్తీపూర్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో నేపాల్‌, యూఏఈ మధ్య మ్యాచ్‌ జరిగింది.

ఈ మ్యాచ్‌ చూడడానికి ప్రేక్షకులు పోటెత్తారు. స్టాండ్స్‌ మొత్తం ఇసుకవేస్తే రాలనంత జనంతో నిండిపోయారు. టికెట్లు దొరకని వారు గ్రౌండ్‌ బయట బారికేడ్ల నుంచి మ్యాచ్‌ను వీక్షించారు. అయితే కొంతమంది మాత్రం మ్యాచ్‌ క్లియర్‌గా కనపడాలన్న ఉద్దేశంతో చెట్లపైకి ఎక్కి వీక్షించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యాయి.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే నేపాల్‌ జట్టు డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో 9 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే సమయానికి నేపాల్‌ జట్టు 44 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. వర్షం ఎంతకు తగ్గకపోవడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిని అమలు చేశారు. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతి ప్రకారం నేపాల్‌ జట్టు చేయాల్సినదానికన్నా తొమ్మిది పరుగులు ఎక్కువగా చేయడంతో ఆ జట్టు గెలిచినట్లు ప్రకటించారు. బీమ్‌ షార్కీ 67 పరుగులతో టాప్‌ స్కోరర్‌ కాగా.. ఆరిఫ్‌ షేక్‌ 52, గుల్షన్‌ జా 50 నాటౌట్‌, కుషాల్‌ బుర్తెల్‌ 50 పరుగులు రాణించారు.

అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన యూఏఈ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. ఆసిఫ్‌ ఖాన్‌ 42 బంతుల్లోనే 4 ఫోర్లు, 11 సిక్సర్లతో 101 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. అర్వింద్‌ 94 పరుగులు చేయగా.. కెప్టెన్‌ ముహ్మద్‌ వసీమ్‌ 63 పరుగులతో రాణించాడు.

ఈ ఏడాది అక్టోబర్‌-నవంబర్‌లో భారత్‌ ఆతిథ్యమివ్వనున్న ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌ 2023కి అర్హత సాధించడం నేపాల్‌, యూఏఈలకు అవసరం. ఐసీసీ క్రికెట్‌ వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌లో నేపాల్‌ నాలుగో స్థానంలో ఉండగా.. యూఏఈ ఆరో స్థానంలో ఉంది. ఇప్పటికే స్కాట్లాండ్‌, ఒమన్‌లు 2023 వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించాయి. 2023 క్రికెట్‌ వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్‌ టోర్నమెంట్‌కు అర్హత సాధించేందుకు మరొక జట్టుకు మాత్రమే అవకాశం ఉంది. 

ఇక ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌కు ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌, అఫ్గానిస్తాన్‌, బంగ్లాదేశ్‌ అర్హత సాధించాయి. ఆతిథ్య హోదాలో టీమిండియా అర్హత దక్కించుకుంది. ఇక సౌతాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్‌లు తాము ఆడే వన్డే సిరీస్‌ల్లో విజయాల ద్వారా అర్హత సాధించే అవకాశం ఉంది. 

చదవండి: ఆసీస్‌ సుందరికి ఎంత కష్టమొచ్చే! 

చరిత్ర సృష్టించిన యూఏఈ క్రికెటర్‌.. వన్డేల్లో ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్డు

మరిన్ని వార్తలు