IPL 2022: పాత గాయాన్ని గుర్తుపెట్టుకొని చావుదెబ్బ తీసింది..

22 May, 2022 08:44 IST|Sakshi
PC: IPL Twitter

ఆట అన్నాకా గెలుపోటములు సహజం. మ్యాచ్‌ ఎంత ఉత్కంఠగా సాగినా ఒకరిని మాత్రమే విజయం వరిస్తుంది.  యాదృశ్చికం అనాలో లేక అలా జరగాలని రాసిపెట్టి ఉందో తెలియదు కానీ ముంబై ఇండియన్స్‌.. ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి నాలుగేళ్ల ప్రతీకారాన్ని తీర్చుకొని దెబ్బకు దెబ్బ తీసింది.

ఐపీఎల్‌ 2022 సీజన్‌ చివరి అంకానికి చేరుకుంది. లీగ్‌ దశ మ్యాచ్‌లు నేటితో ముగియనున్నాయి. ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉండడంతో ఏ జట్టు విజేతగా అవతరిస్తుందనేది ఆసక్తిగా మారింది. కాగా శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌, ముంబై ఇండియన్స​మధ్య మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై ఇండియన్స్‌ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్లేఆఫ్స్‌ ఆశలపై నీళ్లు చల్లింది. మ్యాచ్‌ గెలిచి ఉంటే ఢిల్లీ క్యాపిటల్స్‌ కచ్చితంగా ప్లే ఆఫ్స్‌ వెళ్లేది. ఆ అవకాశం ఇవ్వని ముంబై ఢిల్లీని తమతో పాటు ఇంటికి తీసుకెళ్లి ఆర్సీబీకి మేలు చేసింది.

సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఇదే సీన్‌ రిపీట్‌ అయింది. 2018లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌(ఇప్పటి ఢిల్లీ క్యాపిటల్స్‌) సీజన్‌ను ఆఖరి స్థానంతో ముగించింది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్‌ తమ చివరి మ్యాచ్‌ను ముంబై ఇండియన్స్‌తో ఆడింది. ఈ మ్యాచ్‌ ముంబై ఇండియన్స్‌కు చాలా కీలకం. మ్యాచ్‌ గెలిస్తే ముంబై ప్లే ఆఫ్‌ చేరుతుంది.. ఓడితే రాజస్తాన్‌ రాయల్స్‌ అర్హత సాధిస్తుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌ చేసిన ముంబై 19.3 ఓవర్లలో 163 పరుగులకే ఆలౌటైంది.

దీంతో ఐదో స్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్‌ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. దీనికి ప్రధాన కారణం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌. అలా నాలుగేళ్లు గడిచాయి.. ఇప్పుడు బంతి ముంబై ఇండియన్స్‌ కోర్టులో పడింది. ఢిల్లీ ప్లే ఆఫ్స్‌ చేరాలంటే కచ్చితంగా ముంబైని ఓడించాల్సిందే. కానీ ముంబై ఆ అవకాశం ఇవ్వకుండానే ఢిల్లీని ఇంటిబాట పట్టించి.. ఆర్‌సీబీని ప్లేఆఫ్స్‌కు పంపించి ఒక రకంగా ప్రతీకారం తీర్చుకుంది.  

చదవండి: Tilak Varma: ఐపీఎల్‌లో తెలుగుతేజం తిలక్‌ వర్మ కొత్త చరిత్ర

మరిన్ని వార్తలు