T20 WC: అప్పుడు ధోని.. ఇప్పుడు హర్మన్‌! దురదృష్టం అంటే టీమిండియాదే?

24 Feb, 2023 09:35 IST|Sakshi

మహిళల టీ20 ప్రపంచకప్‌-2023 నుంచి భారత జట్టు ఇంటిముఖం పట్టింది. కేప్‌టౌన్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి సెమీఫైనల్‌లో 5 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి చవిచూసింది. ఆఖరి వరకు భారత్‌ అద్భుతంగా పోరాడనప్పటికీ.. ఓటమి మాత్రం తప్పలేదు.

173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు.. ఓపెనర్లు షఫాలీ వర్మ (9), స్మృతి మంధాన (2) శుభారంభం అందించలేకపోయారు. అనంతరం యస్తిక భాటియా (4) రనౌట్ అయ్యింది. దీంతో కేవలం 28 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఈ క్రమంలో జమీమా రోడ్రిగస్ , కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 69 పరుగులు జోడించారు. అనంతరం రోడ్రిగ్స్‌ (24 బంతుల్లో 43) పరుగులు చేసి పెవిలియన్‌ను చేరింది. అనంతరం హర్మన్‌ తన దూకుడును ఏ మాత్రం తగ్గంచకుండా ఆసీస్‌ బౌలర్లపై విరుచుకుపడింది. ఓ దశలో భారత్‌ సునాయసంగా విజయం సాధిస్తుందని అంతా భావించారు. 

అటువంటి సమయంలో దురదృష్టం టీమిండియాను వెంటాడింది. 15వ ఓవర్లో మొదటి రెండు బంతులకు హర్మన్ ప్రీత్ కౌర్ రెండు ఫోర్లను బాదింది. ఈ క్రమంలో హర్మన్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. 4వ బంతిని హర్మన్ డీప్ మిడి వికెట్ దిశలో స్వీప్ షాట్ ఆడింది.

బంతి బౌండరీకి చేరుతుందనే క్రమంలో గార్డనర్‌ అద్భుతంగా ఫీల్డింగ్‌ చేస్తూ ఆపింది. అనంతరం కీపర్ హీలీకి త్రో చేసింది. ఇదే సమయంలో హర్మన్‌, రిచా రెండో పరుగు కోసం ప్రయత్నించారు. అయితే  క్రీజును చేరుకునే క్రమంలో హర్మన్ బ్యాట్ కాస్త ముందు  ఇరుక్కుపోయింది.

దీంతో ఊహించని రీతిలో హర్మన్ రనౌట్‌గా వెనుదిరిగింది. దీంతో ఒక్క సారిగా మ్యాచ్‌ స్వరూపమే మారిపోయింది. ఇక జ్వరంతోనే బరిలోకి దిగిన టీమిండియా కెప్టెన్‌ హర్మన్‌ అద్భుతమైన పోరాట పటిమ కనబరిచింది.

హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 34 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌ సాయంతో 52 పరుగులు చేసింది. కాగా హర్మన్ రనౌట్‌ను 2019 వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని రనౌట్‌తో పోల్చుతూ అభిమానులు సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

2019 వన్డే ప్రపంచకప్‌లోనూ భారత్‌ ఈ విధంగానే సెమీస్‌లో ఓటమిపాలైంది. మాంచెస్టర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో ధోని కూడా హర్మన్‌లాగే దురదృష్టకర రీతిలో రనౌటయ్యాడు.

భారత్ విజయానికి 10 బంతుల్లో 25 పరుగులు అవసరమైన దశలో మార్టిన్ గుప్టిల్ డైరెక్ట్ త్రో ద్వారా ధోనీను పెవిలియన్‌కు పంపాడు. దీంతో మ్యాచ్‌ కివీస్‌వైపు మలుపు తిరిగింది. ఆ మ్యాచ్‌లో భారత్‌ 18 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. కాగా ధోని,హర్మన్ జర్సీ నెం ఏడు కావడం గమానార్హం.
చదవండి: T20 WC 2022: టీమిండియా కొంపముంచిన రనౌట్‌.. పాపం హర్మన్‌! వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు