Dinesh Karthik: ఇలాంటి షాట్లు డీకేకు మాత్రమే సొంతం.. 

30 Jul, 2022 09:07 IST|Sakshi

టీమిండియా వెటరన్‌ ఆటగాడు దినేశ్‌ కార్తిక్‌(డీకే) ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యున్నత ఫామ్‌ కనబరుస్తున్నాడు. అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్న కార్తిక్‌ మెరుపు ఇన్నింగ్స్‌లతో అలరిస్తున్నాడు. టి20 ప్రపంచకప్‌ 2022 అందించడమే లక్ష్యంగా పెట్టుకున్న డీకే ఆ దిశగా ముందుకు సాగుతున్నాడు. ధోని తర్వాత సరైన ఫినిషర్‌ లేక సతమతమవుతున్న టీమిండియాకు డీకే ఒక వరంలా దొరికాడు. ఐపీఎల్‌ 2022లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తరపున కార్తిక్‌ బెస్ట్‌ ఫినిషర్‌గా నిలిచాడు. ఐపీఎల్‌ ఫామ్‌తో మూడేళ్ల తర్వాత  టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన డీకే ఫినిషర్‌ పాత్రను సమర్థంగా పోషిస్తూ రోజురోజుకు తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటున్నాడు.

తాజాగా శుక్రవారం వెస్టిండీస్‌తో జరిగిన తొలి టి20లో దినేశ్‌ కార్తిక్‌ ఫినిషర్‌ పాత్రలో మరోసారి అదరగొట్టాడు. 16 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు 138 పరుగులు. చివరి నాలుగు ఓవర్లలో టీమిండియా చేసిన పరుగులు 52 పరుగులు. అంటే ఓవర్‌కు 13 చొప్పున.. ఇందులో దినేశ్‌ కార్తిక్‌ చేసినవి 41 పరుగులు. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు కార్తిక్‌ జోరు ఎంతలా కొనసాగిందో. 19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 41 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతని ధాటికి టీమిండియా 20 ఓవర్లలో 190 పరుగుల భారీ స్కోరు సాధించింది. మ్యాచ్‌ విజయంలో కీలకపాత్ర పోషించిన కార్తిక్‌నే ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ వరించింది.

ఇక కార్తిక్‌ బ్యాటింగ్‌ సమయంలో ఆడిన కొన్న షాట్లు అభిమానులను అలరించాయి. విండీస్‌ బౌలర్‌  ఒబే మెకాయ్‌ బౌలింగ్‌లో 19వ ఓవర్‌లో కార్తిక్‌ ఆడిన ఒక షాట్‌ హైలైట్‌గా నిలిచింది. ఓవర్‌ నాలుగో బంతిని స్విచ్‌హిట్‌ ఆడే ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి అనూహ్యంగా టర్న్‌ అవడం.. బ్యాట్‌కు తాకి గాల్లోకి లేచింది. అయితే అది రివర్స్‌ స్లాష్‌ లేక ఎడ్జ్‌ షాటా అనేది ఎవరికి అర్థం కాలేదు. దీంతో ఈ రెండు కలిపి ఆడాడని.. ఇలాంటి షాట్లను డీకే మాత్రమే ఆడగలడని అభిమానులు కామెంట్స్‌ చేశారు.  దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

శుక్రవారం వెస్టిండీస్‌తో జరిగిన తొలి టి20లో టీమిండియా 68 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. రోహిత్‌ శర్మ 64 పరుగులతో ఆకట్టుకోగా.. ఆఖర్లో దినేశ్‌ కార్తిక్‌ మరోసారి ఫినిషర్‌ పాత్ర పోషించడంతో టీమిండియా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌ చేదనలో చతికిలపడింది. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 122 పరుగులు మాత్రమే చేయగలిగింది. టీమిండియా బౌలర్లలో రవి బిష్ణోయి, రవిచంద్రన్‌ అశ్విన్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌ తలా రెండు రెండు వికెట్లు తీశారు. భువనేశ్వర్‌ కుమార్‌, జడేజాలు చెరొక వికెట్‌ తీశారు. 

చదవండి: Rishabh Pant: పంత్‌ అరుదైన ఫీట్‌.. ఈ ఏడాదిలో టీమిండియా తొలి ఆటగాడిగా

మరిన్ని వార్తలు