IPL 2022: ఆ ఆటగాడిని వెనక్కి పిలవండి.. లేదంటే సీఎస్‌కే పని అంతే!

4 Apr, 2022 20:36 IST|Sakshi
Courtesy: IPL Twitter

ఐపీఎల్‌ 2022లో సీఎస్‌కేకు ఘనమైన ఆరంభం లభించలేదు. గతేడాది సీజన్‌లో దుమ్మురేపే ప్రదర్శనతో ఆకట్టుకున్న సీఎస్‌కే నాలుగోసారి చాంపియన్స్‌గా నిలిచింది. అదే ఆటతీరును ప్రస్తుతం కనబరచలేకపోతుంది. ధోని కెప్టెన్‌గా తప్పుకోవడంతో జడేజా ఆ బాధ్యతలు తీసుకున్నాడు. కెప్టెన్‌గా ఉన్నప్పటికి జడేజా ఘోరంగా విఫలమవుతున్నాడు. ధోని మార్క్‌ కెప్టెన్సీని జడ్డూ చూపెట్టలేకపోతున్నాడు. దీనికి తోడూ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓటములను మూటగట్టకుంది.

 దీంతో సీఎస్‌కే అభిమానులు  రైనాను మళ్లీ సీఎస్‌కేలోకి తీసుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్‌ చేస్తున్నారు. ఐపీఎల్‌ మెగావేలానికి ముందు సురేశ్‌ రైనాను సీఎస్‌కే రిలీజ్‌ చేసింది. ఆ తర్వాత మెగావేలంలో రైనాను కొనుగోలు చేయడానికి సీఎస్‌కేతో పాటు ఏ జట్టు ఆసక్తి చూపించలేదు. దీంతో రైనా అమ్ముడపోని జాబితాలో చేరిపోయాడు. అయితే ప్రస్తుతం రైనా ఐపీఎల్‌లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. రైనా జట్టులో లేకపోవడంతోనే సీఎస్‌కే ఈ సీజన్‌ను ఓటములతో ప్రారంభించిదని  ఒక వర్గం అభిమానులు అభిప్రాయపడ్డారు.

2020లో రైనా వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్‌ 13వ సీజన్‌కు దూరమయ్యాడు. యూఏఈ వేదికగా జరిగిన ఆ సీజన్‌లో సీఎస్‌కే దారుణ ప్రదర్శన కనబరిచింది. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచిన సీఎస్‌కే తొలిసారి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. ఆ తర్వాతి సీజన్‌లో రైనా అందుబాటులోకి రావడం.. సీఎస్‌కే విజేతగా నిలవడం యాదృశ్చికంగా జరిగిపోయాయి. అంతేగాక చాలా మంది అభిమానులు సీఎస్‌కే ప్రదర్శనను ఐపీఎల్‌ 2020 సీజన్‌తో పోలుస్తున్నారు.

ఈ రెండు సందర్భాల్లోనూ రైనా జట్టులో లేకపోవడంతో సీఎస్‌కే వరుసగా ఓటములు చవిచూసింది. అందుకే రైనాను వెనక్కి తీసుకురావాలని.. ఒకవేళ​ జట్టులో ఆటగాడిగా కాకున్నా.. కనీసం బ్యాటింగ్‌ మెంటార్‌గానైనా అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు. మీరు ఏమనుకున్నా సరే.. రైనా లేని జట్టును ఊహించకోవడం కష్టంగా ఉంది.. వెంటనే అతన్ని ఏదో ఒక రూపంలో వెనక్కి పిలిపించండి. రైనా సీఎస్‌కేతో పాటు ఉంటే కచ్చితంగా ఐపీఎల్‌ టైటిల్‌ కొడుతుంది.. లేదంటే అంతే సంగతులు అంటూ సీఎస్‌కే అభిమానులు కామెంట్‌ చేశారు.

ఇదంతా వినడానికి ఆశ్చర్యంగా అనిపిస్తున్నా.. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో మాత్రం రైనా పేరు మరోసారి మార్మోగిపోతుంది. ఇంకో విషయమేంటంటే.. రైనా జట్టులో లేని సందర్భాల్లో సీఎస్‌కే 22 మ్యాచ్‌ల్లో 14 సార్లు ఓడిపోయింది. కేవలం 8 మ్యాచ్‌లు మాత్రమే గెలవగలిగింది. సీఎస్‌కేకు రైనా ఇంపాక్ట్‌ ఎంత ఉందో దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు. ఇక రైనా ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్‌లో రైనా 205 మ్యాచ్‌ల్లో 5528 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు సెంచరీలు ఉన్నాయి. ధోని తర్వాత సీఎస్‌కే జట్టులో అంతలా పేరు సంపాదించిన రైనాను అభిమానులు ముద్దుగా చిన్న తలా అని పిలుచుకుంటారు.

చదవండి: IPl 2022: 'ధోని అలా చేసి ఉంటే ఫలితం వేరుగా ఉండేది'

మరిన్ని వార్తలు