IND-W Vs SL-W: ఐపీఎల్‌ అయితే పట్టించుకుంటారా.. బీసీసీఐపై ఫ్యాన్స్‌ ఫైర్‌..!

23 Jun, 2022 16:41 IST|Sakshi

భారత మహిళల జట్టు ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.  ఈ పర్యటనలో భాగంగా భారత్‌ మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. తొలి టీ20 దంబుల్లా వేదికగా నేడు(జూన్‌ 23)న ప్రారంభమైంది. అయితే భారత్‌-శ్రీలంక మ్యాచ్‌లను ప్రసారం చేసేందుకు ఒక్క బ్రాడ్ కాస్టర్ కూడా ముందుకు రాలేదు. ఈ విషయంపై బీసీసీఐ సైతం పత్యేక చొరవ తీసుకోకపోవడంపై అభిమానులు మండిపడుతున్నారు. ఐపీఎల్‌ అయితే పట్టించుకుంటారా.. ఇదేనా మహిళల క్రికెట్‌ అభివృధ్ది అంటూ బీసీసీఐపై నెటిజన్లు విమర్శలు వర్షం కురిపిస్తున్నారు.

కాగా ఇటీవల ఐపీఎల్‌ మీడియా హక్కులు రూ. 48,390 కోట్ల రికార్డు ధరకు అమ్ముడు పోయిన సంగతి తెలిసిందే.ఇక మ్యాచ్‌ల ప్రసారంపై బీసీసీఐ ఏ మాత్రం పట్టించుకోకపోయినా.. శ్రీలంక క్రికెట్‌ మాత్రం తమ అభిమానులు వీక్షించేందుకు పలు వేదికలను ఏర్పాటు చేసింది. "శ్రీలంక పర్యటనలో భారత్‌ మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ మ్యాచ్‌లను శ్రీలంక క్రికెట్‌ యూట్యూబ్‌ ఛానల్‌,  డైలాగ్ టెలివిజన్, ఛానల్ వన్‌ ఎన్‌ఈ లో వీక్షించొచ్చు" అని  శ్రీలంక క్రికెట్‌ ట్విటర్‌లో పేర్కొంది.

ముందుకు వచ్చిన ఫ్యాన్‌కోడ్‌
ఇక చివరగా భారత్‌- శ్రీలంక మ్యాచ్‌లను ప్రసారం చేసేందుకు డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌ ఫ్యాన్‌కోడ్‌ ముందుకు వచ్చింది. ఫ్రీగా తమ వెబ్, యాప్ వేదికల్లో ఇండియా వర్సెస్ శ్రీలంక వుమెన్స్ టూర్ ప్రసారం చేస్తున్నట్లు ట్విటర్‌ వేదికగా ఫ్యాన్‌కోడ్‌ వెల్లడించింది.

మరిన్ని వార్తలు