IND Vs AUS 3rd T20 Tickets: భారత్‌-ఆస్ట్రేలియా మ్యాచ్‌.. హెచ్‌సీఏలో టికెట్ల రగడ

21 Sep, 2022 10:32 IST|Sakshi

ఈ నెల 25న భారత్‌– ఆస్ట్రేలియా టీ– 20 మ్యాచ్‌ 

టికెట్ల కోసం క్రికెట్‌ అభిమానుల పడిగాపులు   

ఉప్పల్‌ స్టేడియం వద్దకు నిత్యం చక్కర్లు 

జింఖానా గ్రౌండ్‌కు తిప్పి పంపిస్తున్న వైనం   

ఎప్పుడో అయిపోయాయంటున్న నిర్వాహకులు 

హెచ్‌సీఏ తీరుపై క్రీడాభిమానుల ఆగ్రహం 

ఉప్పల్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) నిర్లక్ష్య వైఖరిపై క్రికెట్‌ అభిమానులు మండిపడుతున్నారు. ఈ నెల 25న ఉప్పల్‌ స్టేడియంలో భారత్‌– ఆస్ట్రేలియా జట్ల మధ్య టీ– 20 క్రికెట్‌ మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో టికెట్ల కోసం క్రీడాభిమానులు పడిగాపులు కాస్తున్నారు. స్టేడియానికి నిత్యం వచ్చిపోతున్నా పట్టించుకోని పరిస్థితి నెలకొంది. టికెట్లు ఇక్కడ లభించవు జింఖానా  గ్రౌండ్‌లో ఇస్తారని చెప్పి పంపిస్తున్నారు.

అక్కడికి వెళితే ఉప్పల్‌ స్టేడియం వద్దే ఇస్తారంటూ పరుగులు పెట్టిస్తున్నారు. ఇలా అక్కడికీ.. ఇక్కడికీ తిప్పించుకోవడమే తప్ప టికెట్లు మాత్రం ఇవ్వడంలేదని అభిమానులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. టికెట్లు విక్రయించకుండా తమ మనోభావాలతో ఆడుకుంటున్నారని విమర్శిస్తున్నారు. టికెట్ల అమ్మకాల విషయంలో తీవ్ర గందరగోళం నెలకొందని, నిర్వహణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని ఆరోపిస్తున్నారు. 

అరగంటలోనే అమ్ముడుపోయాయట.. 
►టికెట్ల విక్రయం కోసం ఈ నెల 15 నుంచి పేటీఎం ఇన్‌సైడర్‌ యాప్‌ను అందుబాటులో ఉంచినట్లు స్వయంగా హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్‌ అజారుద్దీన్‌ చెబుతున్నప్పటికీ కేవలం అరగంటలోనే అన్ని టికెట్లు విక్రయించినట్లు, యాప్‌లో అవి  అందుబాటులో లేకపోవడంతో హెచ్‌సీఏ పరువు దిగజార్చుకుందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో టికెట్లు అమ్ముడుపోయినా ఆఫ్‌లైన్‌లో అవి లభిస్తాయనే ఆశతో అభిమానులు ఉప్పల్‌ స్టేడియం చుట్టూ నిత్యం చక్కర్లు కొడుతూనే ఉన్నారు.  
►ఉప్పల్, రామంతాపూర్, నాచారం, సికింద్రాబాద్, అంబర్‌పేట, మెహిదీపట్నం, యాదగిరి గుట్ట, ఘట్‌కేసర్‌ తదితర ప్రాంతాల నుంచి అనేక మంది వచ్చి ఉదయం నుంచే స్టేడియం గేటు  వద్ద తిండీతిప్పలు లేకుండా పడిగాపులు కాస్తున్నారు. ఒకానొక దశలో గేట్‌ దూకి వెళ్లడానికి ప్రయత్నించి.. పోలీసులు అడ్డుకోవడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు. టికెట్లు ఎప్పుడు ఇస్తారు? ఎక్కడ ఇస్తారు? లాంటి ప్రశ్నలకు సమాధానం రాక అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

జింఖానా గ్రౌండ్‌ వద్ద గందరగోళం.. గేటుకు తాళం..  
రసూల్‌పుర: క్రికెట్‌ మ్యాచ్‌ టికెట్లు ఇస్తున్నారనే వదంతులతో మంగళవారం సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్‌ వద్దకు వేలాది మంది క్రీడాభిమానులు ఒక్కసారిగా తరలి వచ్చారు. దీంతో భద్రతా సిబ్బంది మైదానం గేటుకు తాళం వేశారు. ఆగ్రహానికి గురైన అభిమానులు గోడ దూకి లోనికి వెళ్లారు. దీంతో సిబ్బంది లాఠీలకు పని చెప్పారు. లాఠీ దెబ్బలు తిన్న అభిమానులు ఒక్కసారిగా రోడ్లపైకి వెళ్లిపోయారు. దీంతో జింఖానా మైదానం పరిసర రోడ్లపై ట్రాఫిక్‌ సమస్య ఏర్పడింది.

సమాచారం అందుకున్న బేగంపేట పోలీసులు జింఖానా మైదానానికి చేరుకుని అక్కడ ఉన్న కొందరు అభిమానులను పంపించివేశారు. గేట్‌ తీసే వరకు కదిలేది లేదని.. మరికొందరు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ నెల 14 నుంచి టికెట్ల కోసం జింఖానా మైదానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నామని ఆగ్రహం వ్యక్తంచేశారు. టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవాలని, ఇప్పటికే అవి అమ్ముడుపోయాయని సిబ్బంది చెబుతున్నారని మండిపడ్డారు. జింఖానా మైదానంలో టికెట్లు ఇస్తారో లేదో స్పష్టంగా చెప్పడం లేదని విరుచుకుపడ్డారు.    

చదవండి: మ్యాచ్‌కు హాజరైన యువరాజ్‌.. కోహ్లితో మాటామంతీ

మరిన్ని వార్తలు