Suryakumar Yadav: 'సూర్యుడి'లా వెలిగిపోతున్నాడు.. ఆపడం కష్టమే

4 Aug, 2022 08:34 IST|Sakshi

సూర్యకుమార్‌ యాదవ్‌.. ప్రస్తుతం టీమిండియాలో ఒక సెన్సేషన్‌. కోహ్లి తర్వాత టీమిండియాకు నమ్మదగిన బ్యాటర్లలో సూర్య ఒకడిగా పేరు తెచ్చుకునే పనిలో ఉన్నాడు. మంచి టెక్నిక్‌.. అవసరమైన దశలో దూకుడైన ఆటతీరు.. ఓపిక ఇలా అన్ని కలగలిపి ఒక పరిపూర్ణ బ్యాటర్‌గా తయారవుతున్నాడు. ప్రస్తుతం 'సూర్యుడి'లా వెలిగిపోతున్న అతన్ని ఆపడం ప్రత్యర్థి జట్లకు ఇక కష్టమే. తాజాగా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అతను ఎగబాకిన తీరే అందుకు నిదర్శనం.

టీమిండియా జట్టులో ఓపెనింగ్‌ నుంచి మొదలుకొని ఏ స్థానంలోనైనా ఆడే సత్తా తనకు ఉందని నిరూపించుకునే పనిలో ఉన్నాడు. తాజాగా వెస్టిండీస్‌తో టి20 సిరీస్‌లో ఓపెనర్‌గా ప్రమోషన్‌ పొందిన సూర్యకుమార్‌ మూడో టి20లో కీలక ఇన్నింగ్స్‌తో మెరిసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అవకాశం ఇచ్చిన ప్రతీసారి తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటున్న సూర్యకుమార్‌ తాజాగా ప్రకటించిన ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నెంబర్‌-2 స్థానానికి చేరుకున్నాడు.

టాప్‌లో ఉన్న బాబర్‌ ఆజంకు, సూర్యకు మధ్య రెండు పాయింట్లు మాత్రమే తేడా. 816 పాయింట్లతో కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌లో నిలిచిన సూర్యకుమార్‌ మరో మంచి ఇన్నింగ్స్‌ ఆడితే టాప్‌ ర్యాంకర్‌ బాబర్‌ అజమ్‌ (పాకిస్తాన్‌; 818 పాయింట్లు)ను వెనక్కి నెట్టి నంబర్‌వన్‌ కావడం ఖాయం.  ఇప్పుడున్న ఫామ్‌లో సూర్యకు ఇది పెద్ద కష్టమేమి కాదు. అయితే ఏడాది క్రితం ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ది 77గా ఉంది.

కట్‌చేస్తే.. ఏడాది వ్యవధిలోనే బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో 77 నుంచి ఏకంగా టాప్‌-2 స్థానానికి చేరుకున్నాడు. కానీ దీని వెనుక సూర్యకుమార్‌ కష్టం మాత్రం​కచ్చితంగా కనిపిస్తుంది. రానున్న టి20 ప్రపంచకప్‌ 2022కు టీమిండియాలో సూర్యకుమార్‌ కీలకం కానున్నాడు. ఒక రకంగా కేఎల్‌ రాహుల్‌ స్థానానికే ఎసరు పెట్టేలా కనిపిస్తున్నాడు.  మరి సూర్యకుమార్‌ ఏడాదిలో సాధించిన ఒక ఐదు రికార్డుల గురించి ఒకసారి చర్చించుకుందాం.

ఇటీవలే ఇంగ్లండ్‌ గడ్డపై జరిగిన టి20 సిరీస్‌లో సూర్యకుమార్‌ మెయిడెన్‌ సెంచరీతో మెరిశాడు. ఇంగ్లండ్‌తో మూడో టి20లో సూర్య ఈ ఫీట్‌ సాధించాడు. 55 బంతుల్లో 117 పరుగులు చేసి టీమిండియా తరపున టి20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రెండో బ్యాటర్‌గా రికార్డు అందుకున్నాడు.


ఇక టి20 మ్యాచ్‌లో టీమిండియా తరపున నాలుగో నెంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి సెంచరీ బాదిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఇంతకముందు కేఎల్‌ రాహుల్‌ మాత్రమే నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి సెంచరీ బాదాడు.
ఇంగ్లండ్‌పై చేసిన తొలి సెంచరీతోనే సూర్యకుమార్‌ ఆస్ట్రేలియా  స్టార్‌ మ్యాక్స్‌వెల్‌ రికార్డును బద్దలు కొట్టాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 117 పరుగులు చేసిన సూర్యకుమార్‌.. 2019లో టీమిండియాపై మ్యాక్స్‌వెల్‌ నాలుగో స్థానంలో వచ్చి 113 నాటౌట్‌ రికార్డును సూర్యకుమార్‌ తుడిచిపెట్టేశాడు.


ఇక తాజాగా వెస్టిండీస్‌ గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన తొలి ఆటగాడిగా సూర్య నిలిచాడు. విండీస్‌తో మూడో టి20లో సూర్య 44 బంతుల్లో 77 పరుగులు చేశాడు. ఇంతకముందు రిషభ్‌ పంత్‌(65*) అత్యధిక స్కోరు సాధించిన తొలి బ్యాటర్‌గా ఉ‍న్నాడు. తాజాగా పంత్‌ను సూర్య అధిగమించాడు.
సూర్య కుమార్‌ ఇప్పటివరకు టి20ల్లో అన్ని లీగ్‌లు కలిపి 201 మ్యాచ్‌లాడి 4379 పరుగులు సాధించాడు. 

చదవండి: Suryakuamar Yadav: దంచికొట్టిన సూర్యకుమార్‌.. లగ్జరీ కారు ఇంటికొచ్చిన వేళ

బాబర్‌ ర్యాంకుకు ఎసరుపెట్టిన సూర్య! నెంబర్‌ 1 స్థానానికి చేరువలో!

మరిన్ని వార్తలు