Babar Azam: 'బ్యాట్‌తోనే సమాధానమిచ్చాడు.. పిచ్చి రాతలు మానుకోండి'

23 Sep, 2022 08:22 IST|Sakshi

పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం తనపై వస్తున్న విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానమిచ్చాడు. కొద్దిరోజులుగా చూసుకుంటే బాబర్‌ ఫామ్‌లో లేక ఇబ్బంది పడుతూ వచ్చాడు. ఆసియా కప్‌లోనూ దారుణంగా విఫలమైన బాబర్‌ ఆజం ఆరు ఇన్నింగ్స్‌లు కలిపి 68 పరుగులు మాత్రమే చేశాడు.  దీంతో అంతర్జాతీయ  మీడియా సహా సోషల్‌ మీడియా బాబర్‌ ఆజంపై పెద్ద ఎత్తున విరుచుకుపడింది. ''పెద్ద జట్లతో బ్యాటింగ్‌ కష్టమే.. వెళ్లి చిన్న దేశాలపై ఆడుకో'' అంటూ కామెంట్‌ చేశారు.

అయితే ఈ విమర్శలను పట్టించుకోని బాబర్‌ ఆజం ఇంగ్లండ్‌తో టి20 సిరీస్‌కు ముందు కచ్చితంగా ఫామ్‌లోకి వస్తానని ధీమా వ్యక్తం చేశాడు. అన్నట్లుగానే ఇంగ్లండ్‌ లాంటి పెద్ద జట్టుపై ఏకంగా సెంచరీ సాధించి ఔరా అనిపించాడు. మహ్మద్‌ రిజ్వాన్‌తో కలిసి 203 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పి ప్రపంచ రికార్డు సాధించాడు.  62 బంతుల్లో సెంచరీ మార్క్‌ను అందుకున్న బాబర్‌ ఆజం ఓవరాల్‌గా 66 బంతుల్లో 110 నాటౌట్‌గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి.

ఇంగ్లండ్‌ లాంటి పెద్ద జట్టుపై సెంచరీ సాధించి ..''చిన్న దేశాలపై ఆడుకో''  అన్న వారి నోళ్లు మూయించాడు. ఇక అతని ఇన్నింగ్స్‌లో క్లాస్‌, మాస్‌ కలగలిపి పాత బాబర్‌ను గుర్తుకుతెచ్చాడు. బాబర్‌ ఆజం సెంచరీపై క్రికెట్‌ ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేశారు. ''బ్యాట్‌తోనే సమాధానమిచ్చాడు.. పిచ్చిరాతలు మానుకోండి'' అంటూ పేర్కొన్నారు. కాగా  బాబర్‌​ ఆజంకు టి20ల్లో ఇది రెండో సెంచరీ. 

చదవండి: ప్రపం‍చ రికార్డుతో మెరిసిన బాబర్‌ ఆజం, మహ్మద్‌ రిజ్వాన్‌


 

మరిన్ని వార్తలు