KL Rahul: ఒక్క ఇన్నింగ్స్‌తో అన్నింటికి చెక్‌.. 

17 Mar, 2023 21:15 IST|Sakshi

''వరుసగా విఫలమవుతున్న అతన్ని ఎందుకు కొనసాగిస్తున్నారు''.. ''టీమిండియాకు భారంగా తయారయ్యాడు.. జట్టు నుంచి తొలగిస్తే మంచిది''.. ''ఐపీఎల్‌లో మాత్రమే మెరుస్తాడు.. జాతీయ జట్టు తరపున అతను ఆడడు''.. ''అతనొక ఐపీఎల్‌ ప్లేయర్‌.. అవకాశాలు వ్యర్థం''.. ఇవన్నీ నిన్న మొన్నటి వరకు కేఎల్‌ రాహుల్‌పై వచ్చిన విమర్శలు.  

కానీ ఇవాళ టీమిండియా కష్టాల్లో ఉంటే అదే కేఎల్‌ రాహుల్ ఆపద్భాందవుడయ్యాడు. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై ఆసీస్‌ బౌలర్లు చెలరేగుతున్న వేళ తనలోని అసలు సిసలైన బ్యాటర్‌ను వెలికి తీసిన కేఎల్‌ రాహుల్‌ తన కెరీర్‌లోనే బెస్ట్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు.  

తాను చేసింది 75 పరుగులే కావొచ్చు.. కానీ ఆ ఇన్నింగ్స్ ఒక సెంచరీతో సమానం. ఎందుకంటే 39 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన రాహుల్‌ ఈసారి ఎలాగైనా ఒక మంచి ఇన్నింగ్స్‌ ఆడి టీమిండియాను గెలిపించాలనుకున్నాడేమో. దానిని చేసి చూపించాడు. ఒత్తిడిలో ఆడినప్పుడే అసలైన బ్యాటర్‌ వెలుగులోకి వస్తాడనే దానికి నిర్వచనంలా మిగిలిపోయింది రాహుల్‌ ఇన్నింగ్స్‌.

అంత క్లాస్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు అతను. అతని ఇన్నింగ్స్‌లో ఒక్కటంటే ఒక్కటి తప్పుడు షాట్‌ లేకపోవడం విశేషం. అర్థసెంచరీ సాధించేంత వరకు కూడా కేఎల్‌ రాహుల్‌ ఒక్క సిక్సర్‌ కూడా కొట్టేలేదంటే బ్యాటింగ్‌ ఎంత కష్టంగా ఉందో చెప్పొచ్చు. మొత్తంగా 90 బంతులాడిన రాహుల్‌ ఏడు ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 75 పరుగులు చేశాడు.

అతను ఆడిన ఈ ఇన్నింగ్స్‌ టీమిండియా అభిమానులకు కొంతకాలం పాటు గుర్తుండిపోవడం ఖాయం.  తన చెత్త ప్రదర్శనతో జట్టులో చోటునే ప్రశ్నార్థకంగా మార్చుకున్న రాహుల్‌ ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో అన్నింటికి చెక్‌ పెట్టి మరో పది మ్యాచ్‌ల వరకు తనపై వేలెత్తి చూపకుండా చేసుకున్నాడు. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేవాడే హీరో అవుతాడని అంటుంటారు.. మరి ఎంత కాదన్నా ఇవాళ మ్యాచ్‌లో కేఎల్‌ రాహుల్‌ హీరోనే కదా.

చదవండి: IND Vs AUS: రాహుల్‌ కెరీర్‌ బెస్ట్‌ ఇన్నింగ్స్‌.. తొలి వన్డే టీమిండియాదే

మరిన్ని వార్తలు