Shubman Gill Career Best Innings: మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు తిట్టుకున్నాడు.. కట్‌చేస్తే

28 Jul, 2022 07:55 IST|Sakshi

వెస్టిండీస్‌తో జరిగిన మూడు వన్డేలో టీమిండియా 119 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో టీమిండియా వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. కరీబియన్‌ గడ్డపై విండీస్‌ను వైట్‌వాష్‌ చేయడం టీమిండియాకు ఇదే తొలిసారి.ఈ సిరీస్‌లో సూపర్‌ ఫామ్‌ కనబరిచిన శుబ్‌మన్‌ గిల్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డును గెలుచుకున్నాడు. మూడు మ్యాచ్‌లాడి 205 పరుగులు చేసిన గిల్‌ ఖాతాలో రెండు అర్థసెంచరీలు ఉన్నాయి.

అయితే బుధవారం జరిగిన మూడో వన్డేలో గిల్‌ 98 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. వర్షం కారణంగా తన మెయిడెన్‌ సెంచరీకి కేవలం రెండు పరుగుల దూరంలో ఆగిపోవాల్సి వచ్చింది. అయితేనేం గిల్‌ కెరీర్‌లో విండీస్‌ వన్డే సిరీస్‌ ప్రత్యేకంగా నిలవనుంది. అయితే ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. మ్యాచ్‌ ప్రారంభానికి కొన్ని గంటల ముందే తన బ్యాటింగ్‌పై గిల్‌ అసహనం వ్యక్తం చేశాడు. ''మంచి ఇన్నింగ్స్‌లు ఆడుతున్నప్పటికి వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమవుతున్నా. స్కూప్‌ షాట్లు ఆడబోయి అనవసరంగా వికెట్లు పారేసుకోవడం బాధను కలిగించింది. ఇప్పటికే నా వన్డే బెస్ట్‌ స్కోరు 68 పరుగులు మాత్రమే. దీనిని మార్చాల్సిన అవసరం ఉంది.'' అంటూ తనను తాను కోపగించుకున్నాడు. 

కట్‌చేస్తే.. మూడో వన్డేలో శుబ్‌మన్‌ గిల్‌ హీరో అయ్యాడు. సెంచరీ మిస్‌ అయినా తన కెరీర్‌లో బెస్ట్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. 98 పరుగులు నాటౌట్‌గా నిలిచి టీమిండియా దిగ్గజ క్రికెటర్ల సరసన నిలిచాడు. ఈ సిరీస్‌లో రాణించడం ద్వారా శుబ్‌మన్‌ గిల్‌ భవిష్యత్తు టీమిండియా జట్టులో తన స్థానాన్ని సుస్థిర పరచుకునే పనిలో ఉన్నాడు.

చదవండి: IND vs WI: కరేబియన్‌ గడ్డపై టీమిండియా కొత్త చరిత్ర

>
మరిన్ని వార్తలు