Virat Kohli: ఇదొక్కటి చాలు.. కోహ్లి ఏంటో చెప్పడానికి!

3 Oct, 2022 11:00 IST|Sakshi

టీమిండియా రన్‌మెషిన్‌ విరాట్‌ కోహ్లి ఇప్పటికే చాలా రికార్డులు అందుకున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కోహ్లికి కింగ్‌ అని పేరు ఉంది. ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో 71 సెంచరీలు సాధించిన కోహ్ల సచిన్‌ తర్వాత.. పాంటింగ్‌తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుత తరంలో అతని దరిదాపుల్లో కూడా ఎవరు లేరు. కీలకమైన టి20 ప్రపంచకప్‌కు ముందు కోహ్లి పూర్తిస్థాయి ఫామ్‌లోకి రావడం అభిమానులను సంతోపెడుతుంది.

తాజాగా ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన రెండో టి20లో కోహ్లి 49 పరుగులు నాటౌట్‌ మరోసారి మెరిశాడు. దూకుడుగా ఆడుతున్న సూర్యకుమార్‌కు సహకరిస్తూ కోహ్లి స్ట్రైక్‌ రొటేట్‌ చేసిన విధాన అందరిని ఆకట్టుకుంది. సూర్య ఔటైన తర్వాత తన బ్యాటింగ్‌ పవరేంటో మరోసారి రుచి చూపించాడు. సూర్య విధ్వంసంలోనూ కోహ్లి తన ట్రేడ్‌మార్క్‌ షాట్లతో అలరించాడు. ఇక టీమిండియా ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో కోహ్లి 28 బంతుల్లో 49 పరుగులతో ఆడుతున్నాడు. దినేశ్‌ కార్తిక్‌ స్ట్రైక్‌లో ఉన్నాడు.

ఫినిషర్‌గా వచ్చిన కార్తిక్‌ తొలి బంతిని మిస్‌ చేశాడు. ఇక రెండో బంతిని బౌండరీ బాదాడు. ఇక మూడో బంతి డాట్‌ పడింది. ఆ తర్వాత వైడ్‌ వచ్చింది. ఇక నాలుగో బంతిని కార్తిక్‌ సిక్స్‌గా మలిచాడు. ఆ తర్వాత కోహ్లి వద్దకు వచ్చిన కార్తిక్‌.. ''హాఫ్‌ సెంచరీ చేస్తానంటే సింగిల్‌ తీసి ఇస్తాను..'' అని అడిగాడు. కానీ కోహ్లి అందుకు ఒప్పుకోలేదు.

''నువ్వు ఫినిషర్‌వి..  నీ పాత్ర పోషించు.. హాఫ్‌ సెంచరీ రాకపోయినా పర్లేదు.'' అని భుజం తట్టి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కార్తిక్‌ ఐదో బంతిని తనదైన స్టైల్లో ఎక్స్‌ట్రా కవర్స్‌ మీదుగా కళ్లు చెదిరే సిక్స్‌ కొట్టాడు. ఇక ఇన్నింగ్స్‌ చివరి బంతిని సింగిల్‌ తీసిన కార్తిక్‌ 7 బంతుల్లో 17 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కాగా కోహ్లి తన హాఫ్‌ సెంచరీ కంటే జట్టుకు స్కోరు అందివ్వడమే ముఖ్యమని కార్తిక్‌కు చెప్పిన తీరు అభిమానులను ఆకట్టుకుంటుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన కోహ్లి అభిమానులు.. ''ఇదొక్కటి చాలు కోహ్లి ఏంటో చెప్పడానికి'' అంటూ కామెంట్‌ చేశారు.


చదవండి: స్వదేశంలో టీమిండియా కొత్త చరిత్ర..

కోహ్లి కెరీర్‌లో తొలిసారి.. జీవితకాలం గుర్తుండిపోవడం ఖాయం!

మరిన్ని వార్తలు