Kohli-KL Rahul: రోహిత్‌ లేకుంటే ఫ్రీ హ్యాండ్‌ తీసుకుంటారా!

9 Sep, 2022 08:12 IST|Sakshi

1020 రోజులు... ఒకటి కాదు రెండు కాదు దాదాపు మూడేళ్లుగా ఎదురు చూసిన క్షణం... సింగిల్‌ తీసినంత సులువుగా సెంచరీలు సాధించిన కోహ్లి 70 నుంచి 71కి చేరేందుకు మైళ్ల కొద్దీ సుదీర్ఘ ప్రయాణం చేస్తున్న భావన... ఆటలో లోపం కనిపించలేదు, పరుగులు చేయడం లేదనే సమస్య రాలేదు... అయితే తన ఘనతలే తనకు శత్రువుగా మారినట్లుగా, తానే నిర్దేశించిన స్థాయిని అందుకోలేని ప్రతీ సారి అభిమానులకు అదో వైఫల్యంలాగే కనిపించింది.

బయట నుంచి విమర్శలు, విశ్లేషణలు సరే సరి. రోజులు గడచిపోతున్నా... టెస్టులు, వన్డేలు ముగిసిపోతున్నా ఆ శతకం మాత్రం రాదే! ఇక ఎప్పుడో, అసలు చేస్తాడా లేదా అనుకుంటున్న దశలో కోహ్లి కొట్టి పడేశాడు. అనూహ్యంగా, గతంలో ఒక్క సెంచరీ లేని ఫార్మాట్‌లో మెరుపు శతకంతో చెలరేగాడు. వేయి రోజులకు పైగా సాగిన వేదనకు తెర దించుతూ తనకే సొంతమైన సొగసరి షాట్లతో సత్తా చాటాడు. చూడచక్కటి సిక్సర్‌తో ఆ ఘనతను అందుకొని చిరునవ్వులు చిందించాడు. ఫలితం పరంగా ప్రాధాన్యత లేని మ్యాచ్‌లోజట్టు ఆటకంటే ఒక అద్భుత వ్యక్తిగత ప్రదర్శనకు సలామ్‌ కొట్టి తీరాల్సిందే.

ఇదంతా పక్కనబెడితే టీమిండియా అభిమానుల్లో ఒక సందేహం తలెత్తింది. గురువారం అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌కు టీమిండియా రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ దూరంగా ఉన్నాడు. దీంతో కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. మ్యాచ్‌ ప్రారంభానికి ముందు కేఎల్‌ రాహుల్‌తో సూర్యకుమార్‌ ఓపెనింగ్‌ చేస్తాడని అంతా భావించారు. కానీ అనూహ్యంగా విరాట్‌ కోహ్లి ఓపెనర్‌గా వచ్చాడు. ఇద్దరు కలిసి అఫ్గన్‌ బౌలింగ్‌ను ఒక ఆట ఆడుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే రోహిత్‌ శర్మ లేకపోతే కోహ్లి, కేఎల్‌ రాహుల్‌ ఫ్రీ హ్యాండ్‌ తీసుకుంటారా అంటూ అభిమానులు కామెంట్‌ చేశారు.

ఇక కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్సీ ఇస్తే కానీ సరిగ్గా ఆడడేమోనని పేర్కొన్నారు. నిన్నటి మ్యాచ్‌లో కేఎల్‌ రాహుల్‌ ఆటతీరు కూడా అలాగే ఉంది. 41 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 62 పరుగలు బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇక కోహ్లి కూడా రోహిత్‌ గైర్హాజరీలో బ్యాట్‌ను ఝులిపించడంతో ఈ అనుమానాలు ఎక్కువయ్యాయి. హిట్‌మ్యాన్‌తో కోహ్లి, రాహుల్‌కు బయటకు మంచి సంబంధాలే కనిపిస్తున్నప్పటికి.. లోలోపల మాత్రం రోహిత్‌తో ఈ ఇద్దరికి సరైన సమన్వయం లేదని అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు.

మరొక విషయమేంటంటే.. కోహ్లి, రాహుల్‌కు మధ్య మంచి సన్నిహిత్యం ఉందని.. హిట్‌మ్యాచ్‌ లేకపోతే వీరిపై ఎలాంటి ఒత్తిడి లేకపోవడంతో స్వేచ్ఛగా ఆడుతుంటారని పేర్కొన్నారు. ఏది ఏమైనా ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. వాస్తవానికి రోహిత్‌తో కోహ్లి, రాహుల్‌కు ఎలాంటి సమస్య లేదనుకోవచ్చు. ఏది ఏమైనా ఆసియాకప్‌ నుంచి టీమిండియా నిష్ర్కమించినప్పటికి.. కోహ్లి సెంచరీతో కమ్‌బ్యాక్‌ ఇవ్వడం.. కేఎల్‌ రాహుల్‌ అర్థసెంచరీతో ఫామ్‌లోకి రావడం శుభసూచకం.

ఒక రకంగా ఈ ఓటమి భారత్‌కు ఒక గుణపాఠం. రానున్న టి20 ప్రపంచకప్‌కు ముందు ఇలాంటి దెబ్బ పడితేనే టీమిండియా జాగ్రత్తగా ఉంటుందని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు. టి20 ప్రపంచకప్‌కు ముందు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో జరగనున్న టి20 సిరీస్‌లు భారత్‌కు మంచి ప్రాక్టీస్‌ అని చెప్పొచ్చు.  
-సాక్షి, వెబ్‌డెస్క్‌

చదవండి: కోహ్లి కమాల్‌..అఫ్ఘాన్ పై భారత్ ఘన విజయం

Virat Kohli: 'కింగ్‌ ఈజ్‌ బ్యాక్‌'.. ఎన్నాళ్లకెన్నాళ్లకు 

మరిన్ని వార్తలు