IND VS NZ 3rd T20: శభాష్‌ సిరాజ్‌.. బుమ్రా లేని లోటును తీరుస్తున్నావు..!

22 Nov, 2022 21:40 IST|Sakshi

నేపియర్‌ వేదికగా భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య ఇవాళ (నవంబర్‌ 22) జరిగిన మూడో టీ20.. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం టైగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌.. డెవాన్‌ కాన్వే (59), గ్లెన్‌ ఫిలిప్స్‌ (54) అర్ధసెంచరీలతో రాణించడంతో 19.4 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌట్‌ కాగా.. ఛేదనలో భారత్‌ స్కోర్‌ 9 ఓవర్ల తర్వాత 4 వికెట్ల నష్టానికి 75 పరుగుల వద్ద ఉండగా, ఒక్కసారిగా వర్షం ప్రారంభమై మ్యాచ్‌ను డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతి ప్రకారం టైగా ముగిసేలా చేసింది. 

డీఎల్‌ఎస్‌ ప్రకారం 9 ఓవర్ల తర్వాత టీమిండియా గెలిచి ఉండాలంటే 76 పరుగులు చేయాల్సి ఉండింది. అయితే ఈ సమయానికి టీమిండియా స్కోర్‌ 75 పరుగులు మాత్రమే ఉండటంతో అంపైర్లు మ్యాచ్‌ను డీఎల్‌ఎస్‌ టైగా ప్రకటించారు. సిరీస్‌లో తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా.. రెండో టీ20లో 'సూర్య'ప్రతాపం (111 నాటౌట్‌) చూపించడంతో టీమిండియా 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 3 మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 1-0 తేడాతో కైవసం చేసుకుంది.  

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టీమిండియా పేసర్లు మహ్మద్‌ సిరాజ్‌ (4/17), అర్షదీప్‌ సింగ్‌ (4/37) కివీస్‌ పతనాన్ని శాసించారు. వీరిలో ముఖ్యంగా సిరాజ్‌ నిప్పులు చెరిగే బంతులతో మార్క్‌ చాప్‌మన్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, జిమ్మీ నీషమ్‌, మిచెల్‌ సాంట్నర్‌ వికెట్లు పడగొట్టి సౌధీ సేన వెన్ను విరిచాడు. ఓ దశలో న్యూజిలాండ్‌ భారీ స్కోర్‌ దిశగా సాగుతుండగా.. డేంజరెస్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌ వికెట్‌ పడగొట్టిన సిరాజ్‌ ఆ జట్టు భారీ స్కోర్‌ అవకాశాలకు గండికొట్టాడు. ఈ మ్యాచ్‌లో వికెట్లు పడగొట్టడంతో పాటు అత్యంత పొదుపుగా బౌలింగ్‌ చేసిన సిరాజ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డును సైతం అందుకున్నాడు. 

సిరాజ్‌.. రెండో టీ20లోనూ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తన కోటా 4 ఓవర్లలో ఒక మొయిడిన్‌ వేసి 24 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. ఈ సిరీస్‌లో 2 మ్యాచ్‌లు ఆడిన సిరాజ్‌.. 6.83 సగటున, 5.12 ఎకానమీతో 6 వికెట్లు పడగొట్టాడు. ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు, బెస్ట్‌ యావరేజ్‌, బెస్ట్‌ ఎకానమీ, బెస్ట్‌ స్ట్రయిక్‌ రేట్‌ సిరాజ్‌ ఖాతాలోనే ఉన్నాయి. ఈ సిరీస్‌లో సిరాజ్‌ ప్రదర్శనను మెచ్చిన అభిమానులు అతన్ని అభినందనలతో ముంచెత్తుతున్నారు. శభాష్‌ సిరాజ్‌.. ఇటీవలి కాలంలో బాగా రాటు దేలావు.. బుమ్రా లేని లోటును తీరుస్తున్నావు అంటూ కితాబునిస్తున్నారు. టీ20 వరల్డ్‌కప్‌లో నువ్వు ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదంటూ కామెంట్లు చేస్తున్నారు.  
 

మరిన్ని వార్తలు