IND Vs NZ: సంజూ శాంసన్‌కు మళ్లీ అన్యాయమే.. అభిమానుల ఆగ్రహం

20 Nov, 2022 13:30 IST|Sakshi

టీమిండియా యువ ఆటగాడు సంజూ శాంసన్‌ మరోసారి అన్యాయానికి గురయ్యాడు. సీనియర్‌ జట్టుకు విశ్రాంతి ఇచ్చినప్పుడు అతన్ని జట్టుకు ఎంపిక చేయడమే తప్ప మ్యాచ్‌లు ఆడించడం లేదు. తాజాగా న్యూజిలాండ్‌తో టి20 సిరీస్‌లోనూ సంజూకు మళ్లీ అదే పరిస్థితి ఎదురవుతోంది. తొలి టి20లో తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయిన శాంసన్‌కు ఆదివారం జరిగిన రెండో టి20లోనూ మరోసారి మొండిచేయి ఎదురైంది. ఈ నేపథ్యంలో సంజూ శాంసన్‌ను ఆడించకపోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

''అసలు మ్యాచ్‌లు ఆడిస్తే కదా సంజూ శాంసన్‌ ప్రతిభ తెలుస్తుంది. అన్ని సిరీస్‌లకు ఎంపిక చేయడం.. మ్యాచ్‌ సమయానికి మాత్రం పక్కనబెడితే ఏం లాభం.. అతని టాలెంట్‌ను తొక్కేస్తున్నారు.. ఒక్క అవకాశం ఇచ్చి చూడండి అతనేంటో చూపిస్తాడు.. మీ చిల్లర రాజకీయాలకు ఒక్క మంచి ఆటగాడి భవిష్యత్తును నాశనం చేస్తున్నారు.'' అంటూ పేర్కొన్నారు.

ఇదే విషయమై మ్యాచ్‌ ప్రారంభానికి ముందు కామెంటేటర్స్‌ టాక్‌లో రవిశాస్త్రి కూడా సంజూ శాంసన్‌పై స్పందించాడు.''ప్రస్తుతం జట్టులో ఉన్న సీనియర్లను బెంచ్‌కు పరిమితం చేసి సంజూ శాంసన్‌ లాంటి ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలి. వరుసగా 10 మ్యాచ్‌లు ఆడించాలి.. అంతేకాని రెండు మ్యాచ్‌లకే పక్కనబెట్టకూడదు. 10 మ్యాచ్‌ల తర్వాత అతని ప్రదర్శనను చూసి అప్పడు ఆలోచించాలి. అతనికి కూడా అవకాశాలు ఇస్తేనే కదా టాలెంట్‌ ఏంటో తెలిసేది'' అంటూ తెలిపాడు.

ఇక సంజూ శాంసన్‌ టాలెంట్‌లో మాత్రం కొదువ లేదు. ఐపీఎల్‌ ద్వారా వెలుగులోకి వచ్చిన సంజూ శాంసన్‌ రాజస్తాన్‌ రాయల్స్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. వరుసగా రెండు సంవత్సరాల నుంచి ఐపీఎల్‌లో స్థిరమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. అంతేకాదు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లోనూ తనకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూనే వస్తున్నాడు. అయినప్పటికి సంజూకు అన్యాయం జరుగుతూనే ఉంది. 

చదవండి: ఓపెనర్‌గా అవకాశం ఇచ్చిన మళ్లీ విఫలం.. ఇతన్ని టీమిండియా కెప్టెన్‌ చేయాలట..!

మరిన్ని వార్తలు