IPL 2022: అరె ఇషాంత్‌ భయ్యా.. ఇదేం కర్మ!

31 Mar, 2022 16:43 IST|Sakshi

టీమిండియా వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ.. ఒకప్పుడు జట్టులో స్టార్ బౌలర్‌గా వెలుగొందాడు. లంబూ అని ముద్దుగా పిలుచుకునే ఇషాంత్‌ కొన్నాళ్లపాటు టీమిండియా టెస్టు జట్టులో పెద్దన్న పాత్ర పోషించాడు. షమీ, బుమ్రాల రాకతో ఇషాంత్ ప్రతిభ వెనుకబడిపోయింది. ఆ తర్వాత ఫామ్‌ కోల్పోయి జట్టుకు క్రమంగా దూరమయ్యాడు. ఈ ఏడాది ఆరంభంలో సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌ను టీమిండియా 2-1 తేడాతో అప్పగించింది. ఒక రకంగా ఇషాంత్‌కు సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌ ఆఖరుదని చెప్పొచ్చు.

అంతేకాదు శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ఇషాంత్‌ను ఎంపిక చేయలేదు. రహానే, పుజారా, సాహాలతో పాటు ఇషాంత్‌ను ఎంపికచేయలేదు. రహానే, పుజారాలు మళ్లీ జట్టులో అడుగుపెట్టే అవకాశం ఉన్నప్పటికి ఇషాంత్‌ కెరీర్‌ దాదాపు ముగిసినట్లే అని చెప్పొచ్చు. అలాంటి లంబూను ఇటీవలే ముగిసిన మెగావేలంలో ఎవరు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. దీంతో అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితాలో ఇషాంత్ చేరిపోయాడు.


ఇక ఐపీఎల్‌లో ఇషాంత్‌ కనబడడు అని మనం అనుకునేలోపు బుధవారం ఆర్‌సీబీ, కేకేఆర్‌ మధ్య మ్యాచ్‌కు సడెన్‌గా ప్రత్యక్షమయ్యాడు. అయితే ఆటగాడిగా కాకుండా వర్చువల్‌ గెస్ట్‌ అభిమానిగా కనిపించాడు. కరోనా మొదలైనప్పటికి నుంచి వర్చువల్ గెస్ట్‌ బాక్స్‌ నిర్వహిస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆయా ఫ్రాంచైజీల అభిమానులు ఈ గెస్ట్‌ బాక్స్‌లో పాల్గొంటారు. అలా ఇషాంత్‌ కూడా ఆర్‌సీబీ, కేకేఆర్‌ మ్యాచ్‌కు గెస్ట్‌ బాక్స్‌లో కనిపించాడు.

ఇది చూసిన అభిమానులు ఊరుకుంటారా.. ఇషాంత్‌పై ట్వీట్స్‌ వర్షం కురిపించారు. ''ఒక టైమ్‌లో టీమిండియాలో బెస్ట్‌ బౌలర్‌గా ఉన్నాడు.. ఇప్పుడు మాత్రం.. ఇషాంత్‌ బాయ్‌ మళ్లీ టీమిండియాకు ఆడే అవకాశం లేదా.. అరె ఇషాంత్‌ శర్మ.. ఇది ఏం కర్మరా బాబు'' అంటూ కామెంట్స్‌ చేశారు. కాగా ఇషాంత్‌ శర్మ టీమిండియా తరపున 105 టెస్టుల్లో 311 వికెట్లు, 80 వన్డేల్లో 114 వికెట్లు, ఐపీఎల్‌లో 93 మ్యాచ్‌ల్లో 72 వికెట్లు పడగొట్టాడు.

చదవండి: IPL 2022: పంజాబ్‌ కింగ్స్‌కు గుడ్‌న్యూస్‌.. సిక్స‌ర్ల వీరుడు వచ్చేశాడు!

మరిన్ని వార్తలు