CWG 2022: ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ ధర తెలిస్తే షాకవ్వడం ఖాయం!

2 Aug, 2022 13:52 IST|Sakshi

మాములుగా మనం తినే ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ ధర రూ.100కు మించి ఉండదు. కానీ బర్మింగ్‌హమ్‌ వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్‌ గేమ్స్‌కు వెళితే.. అక్కడ మీరు కొనుక్కునే ప్లేట్‌ ఫ్రెంచ్‌ ఫ్రైస్‌, సాసేజ్‌ బాక్స్‌ ధర ఎంత తెలుసా అక్షరాల వెయ్యి రూపాయలు. సాధారణంగా ఎక్కడైనా ఒక కార్యక్రమం జరుగుతుంటే అక్కడ పెట్టే షాపుల్లో బయటికన్నా ధరలు రెట్టింపు ఉండడం సహజం. కానీ కామన్‌వెల్త్‌ గేమ్స్‌కు వస్తున్న అభిమానులు ఏమైనా తినాలంటే పర్సు ఖాళీ చేయాల్సిందే. అంతలా మండిపోతున్నాయి అక్కడి రేట్లు.

కామన్‌వెల్త్‌లో ఆయా దేశాలు ఆటగాళ్లు పతకాల పంట పండిస్తుంటే.. అక్కడి వ్యాపారులు మాత్రం కామన్‌వెల్త్‌ చూసేందుకు వస్తున్న అభిమానుల జేబులకు చిల్లు పెడుతూ తమ పంట పండించుకుంటున్నారు.  ఈ క్రమంలోనే ఫ్రెంచ్ ఫ్రైస్, ఒక సాసేజ్ ఉన్న బాక్సును ఏకంగా 9.80 యూరోలకు అమ్మేస్తున్నారు. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.వెయ్యి రూపాయలు. అంటే ప్రేక్షకులు ఫ్రెంచ్ ఫ్రైస్, ఒక సాసేజ్ తీసుకుంటూ వెయ్యి రూపాయలు చెల్లించాల్సి ఉంటుందన్నమాట. ఇందులో భాగంగానే ఒక అభిమాని ట్విటర్‌ వేదికగా తన గోడును వెల్లబోసుకున్నాడు.

''కామన్‌వెల్త్‌ గేమ్స్‌ చూడడానికి ఎంతో దూరం నుంచి వచ్చాం. ఏమైనా తినాలని కొనడానికి వెళ్తే పర్సు ఖాళీ అవుతుంది. పోనీ అంత భారీ రేటుతో కొన్నా ఫ్రైంచ్ ఫ్రైస్ పచ్చిగానే ఉంటుంది.. వాటిని ఫ్రై చేయడానికి ఇంకా డబ్బులు తగలేస్తున్నామంటూ?'' ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక కామన్‌వెల్త్‌ గేమ్స్‌ 2022లో భారత్‌ పతకాల జోరు కొనసాగిస్తుంది. నాలుగు రోజుల్లో భారత్‌ ఖాతాల్లో 9 పతకాలు జమవ్వగా.. అందులో మూడు స్వర్ణం, మూడు రజతం.. మరో మూడు కాంస్య పతకాలు ఉన్నాయి. ప్రస్తుతం భారత్‌ పతకాల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతుంది.

చదవండి: CWG 2022: కామన్‌వెల్త్‌లో అపశ్రుతి.. తీవ్రంగా గాయపడ్డ భారత మహిళా సైక్లిస్ట్‌

Common Wealth Games 2022: స్వర్ణంపై భారత్‌ గురి.. అసలు లాన్‌ బౌల్స్‌ అంటే ఏమిటి?

మరిన్ని వార్తలు