Rohit Sharma: 'టి20 ప్రపంచకప్‌కు 95శాతం జట్టు రెడీ'.. రోహిత్‌పై విమర్శలు 

7 Sep, 2022 19:50 IST|Sakshi

టైటిల్‌ ఫెవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియా చేజేతులా ఓటములను కొనితెచ్చుకొని సూపర్‌-4 దశలోనే ఇంటిబాట పట్టాల్సి వస్తోంది. పాకిస్తాన్‌, శ్రీలంకలతో జరిగిన మ్యాచ్‌ల్లో కేవలం బౌలింగ్‌ వైఫల్యం వల్లే టీమిండియా ఓడిందంటే అతిశయోక్తి కాదు. ఆసియాకప్‌లో టీమిండియా పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్‌ ఆడినప్పుడు భువనేశ్వర్‌ కుమార్‌ మంచి ఆత్మవిశ్వాసంతో బౌలింగ్‌ చేశాడు. అయితే ఆ తర్వాత లయను కోల్పోయిన భువీ.. కీలకదశలో పరుగులిచ్చి టీమిండియా ఓటమికి ప్రధాన బాధ్యత వహించాల్చి వచ్చింది.

భువనేశ్వర్‌తో పాటు మిగతా బౌలర్లు పెద్దగా రాణించలేదనే చెప్పాలి. బుమ్రా లేని లోటు స్పష్టంగా కనిపించగా.. గాయంతో జడేజా టోర్నీకి దూరమవ్వడం మరో ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు. అయితే ఆసియాకప్‌ను టి20 ప్రపంచకప్‌కు సన్నాహకంగా భావిస్తున్నామని టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ బల్లగుద్ది చెప్పాడు. టి20 ప్రపంచకప్‌కు టీమిండియా ఆడబోయే ది బెస్ట్‌ టీమ్‌ ఇక్కడే దొరుకుతుందని చెప్పాడు. కానీ తీరా చూస్తే బెస్ట్‌ టీమ్‌ కాదు కదా... అసలు జట్టులో చాలా మార్పుల అవసరం కనిపిచింది. ఆసియాకప్‌లో ఇప్పటివరకు టీమిండియా నాలుగు మ్యాచ్‌లు ఆడితే.. నాలుగుసార్లు తుది జట్టులో మార్పులు జరిగాయి. దీంతో కెప్టెన్‌ రోహిత్‌, కోచ్‌ ద్రవిడ్‌లపై విమర్శలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో  టీమిండియా సారథి రోహిత్ శర్మ మంగళవారం శ్రీలంకతో మ్యాచ్ ముగిశాక  నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాబోయే టీ20 ప్రపంచకప్ లో తుది జట్టు ఎంపికపై తాము కసరత్తులు చేస్తున్నామని.. ఆమేరకు 95 శాతం జట్టు  సిద్ధమైందని పేర్కొన్నాడు. అయితే రోహిత్‌ శర్మ వ్యాఖ్యలపై టీమిండియా అభిమానులు ఘాటుగా స్పందించారు.

రోహిత్‌ మాట్లాడుతూ.. ''టి20 ప్రపంచకప్ కోసం ఇప్పటికే 90-95 శాతం జట్టు రెడీ అయింది. కొన్ని మార్పులు చేర్పులున్నాయి. వాటిని కూడా తొందర్లోనే పూరిస్తాం. అయితే కొన్ని విషయాల్లో క్లారిటీ రాలేకపోతున్నాం. అందుకే ప్రయోగాలు చేస్తూనే ఉన్నాం.  ఏదైనా ప్రయత్నిస్తేనే కదా ఫలితమేంటో తెలిసేది. అందుకే  ఆసియా కప్‌లో కొన్ని ప్రయోగాలు చేశాం. ఆసియా కప్‌కు ముందు మేం నలుగురు సీమర్లు, ఇద్దరు స్పిన్నర్లతో ఆడాం.  రెండో స్పిన్నర్.. ఆల్‌రౌండర్‌ అయ్యేలా చూసుకున్నాం.  

నేను ఏ విషయంలో అయినా ముందు ప్రయత్నం చేసి తద్వారా ఫలితాలను బట్టి ఒక అంచనాకు వస్తాను. అదే ఆసియా కప్ లోనూ చేశాను.  ఇద్దరు స్పెషలిస్టు సీమర్లు, ఇద్దరు స్పిన్నర్లు, ఒక  మీడయం పేసర్ తో ఆడితే ఎలా ఉంటుందని నేను ట్రై చేశాను. మాకు టీ20 ప్రపంచకప్ కు ఇంకా సమయముంది..  ఆలోపు మాకు మరో రెండు సిరీస్ లు ఉన్నాయి.. అక్కడా మాకు ప్రయోగాలు చేయడానికి ఆస్కారముంది’ అని అన్నాడు. 

దీపక్‌ హుడాకు బౌలింగ్‌ ఇవ్వకపోవడానికి ఒక కారణం ఉంది.  ఐదుగురు బౌలర్లతో ఆడితే ఏమవుతుందనే కోణంలో ప్రయత్నించాం. లంకతో మ్యాచ్ లో  అప్పటికే ఇద్దరు ఓపెనర్లు కుదురుకున్నారు. ఆ సమయంలో అటాకింగ్ స్పిన్ వేసే చహల్, అశ్విన్ కు బంతినిస్తే బెటరని అనిపించింది. ఆరో బౌలింగ్ ఆప్షన్ గా నా మనసులో హుడా కూడా ఉన్నాడు. మేం త్వరగా వికెట్లు తీసుంటే హుడాతో బౌలింగ్ చేయిద్దామనుకున్నా. కానీ అలా జరగలేదు.. ప్రపంచకప్‌లో ఆడేటప్పుడు ఇది గుణపాఠంగా పనికొస్తుంది. ఇక కార్తిక్‌ ఆడించకపోవడంపై ఒక కారణం ఉంది. మిడిలార్డర్ లో లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ కాంబినేషన్ కావాలనుకున్నాం. అందుకే పంత్‌ను ఆడించాం. అంతేగానీ కార్తీక్ ఫామ్ గురించో..  మరొకటో కాదు.. అయితే ఆ వ్యూహం బెడిసికొట్టింది.'' అంటూ చెప్పుకొచ్చాడు.

మరిన్ని వార్తలు