IPL 2022 LSG Vs RCB: అంపైర్‌ వైడ్‌ ఇచ్చుంటే లక్నో మ్యాచ్‌ గెలిచేదేమో!

20 Apr, 2022 10:46 IST|Sakshi
Courtesy: IPL Twitter

ఐపీఎల్‌ 2022లో ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ 18 పరుగుల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అయితే స్టోయినిస్‌ క్రీజులో ఉన్నంతవరకు మ్యాచ్‌ లక్నోవైపే మొగ్గు చూపింది. ఎందుకంటే స్టోయినిస్‌ క్రీజులో ఉన్నప్పడు లక్నో విజయానికి 12 బంతుల్లో 34 పరుగులు కావాలి. స్టోయినిస్‌తో పాటు జాసన్‌ హోల్డర్‌ క్రీజులో ఉండడంతో విజయంపై ఆశలు బలంగా ఉన్నాయి. ఈ దశలో ఒక అంపైర్‌ ఒక బంతిని వైడ్‌ బాల్‌గా పరిగణించకపోవడంతో స్టోయినిస్‌ తన ఫోకస్‌ను కోల్పోయి వికెట్‌ పోగొట్టుకున్నాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.

విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌ జోష్‌ హాజిల్‌వుడ్‌ వేశాడు. హాజిల్‌వుడ్‌ వేసిన ఓవర్‌ తొలి బంతి ఆఫ్‌స్టంప్‌కు దూరంగా వెళ్లింది. అయితే అంపైర్‌ మాత్రం వైడ్‌ ఇవ్వలేదు. దీంతో వైడ్‌ ఇవ్వకపోవడమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేసిన స్టోయినిస్‌ అంపైర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలోనే ఫోకస్‌ కోల్పోయిన స్టోయినిస్‌ హాజిల్‌వుడ్‌ వేసిన తర్వాతి బంతికే క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. దీంతో కోపంతో ఊగిపోయిన స్టోయినిస్‌ అంపైర్‌ను సీరియస్‌గా చూస్తూ పెవిలియన్‌ బాట పట్టాడు.

అయితే స్టోయినిస్‌ విషయంలో అంపైర్‌ వ్యవహరించిన తీరుపై సోషల్‌ మీడియాలో తప్పుబట్టారు. బంతి అంత క్లియర్‌ ఆఫ్‌స్టంప్‌కు దూరంగా వెళ్తుంటే వైడ్‌ ఇవ్వకపోవడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ''ఒకవేళ అంపైర్‌ వైడ్‌ ఇచ్చుంటే లక్నో సూపర్‌ జెయింట్స్‌ మ్యాచ్‌ గెలిచేదేమో.. ఎవరికి తెలుసు'' అంటూ కామెంట్‌ చేశారు. అయితే మరికొందరు మాత్రం లక్నో మేనేజ్‌మెంట్‌ను తప్పుబట్టారు. చేజింగ్‌ సమయంలో దాటిగా ఆడే స్టోయినిస్‌ లాంటి బ్యాటర్‌ను లేటుగా పంపించడమేంటని చురకలు అంటించారు.

చదవండి: Kohli-Wasim Jaffer: కోహ్లి పరిస్థితిని కళ్లకు కట్టిన టీమిండియా మాజీ క్రికెటర్‌

IPL 2022: చహల్‌ హ్యాట్రిక్‌.. ఆ పోజుతో ప్రతీకారం తీర్చుకున్నాడా! 

మరిన్ని వార్తలు