Umran Malik: తప్పు చేశారు.. ప్రపంచకప్‌కు ఎంపిక చేసి ఉంటే

25 Nov, 2022 17:28 IST|Sakshi

టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ డెబ్యూ వన్డేలోనే ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. శుక్రవారం ఆక్లాండ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో ఉమ్రాన్‌ మాలిక్‌ తాను వేసిన తొలి ఐదు ఓవర్లలో ప్రతీ బంతిని 140 కిమీ వేగానికి మించి వేయడం విశేషం. ఇక ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌లో ఓపెనర్‌ డెవన్‌ కాన్వేను ఔట్‌ చేయడం ద్వారా వన్డేల్లో తొలి వికెట్‌ దక్కించుకున్నాడు.

అయితే కాన్వే ఔట్‌ చేసిన మరుసటి బంతిని గంటకు 153.1 కిమీ వేగంతో వేయడం విశేషం. ఇక తన ఐదో ఓవర్లో డారిల్‌ మిచెల్‌ను తక్కువ స్కోరుకే పెవిలియన్‌ చేర్చాడు. అలా తొలి ఐదు ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీసిన ఉమ్రాన్‌ తర్వాతి ఐదు ఓవర్లలో మాత్రం పెద్దగా ప్రభావం చూపించలేదు. ఓవరాల్‌గా ఉమ్రాన్‌ మాలిక్‌ తన పది ఓవర్ల కోటాలో 66 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. 

ఇక డారిల్‌ మిచెల్‌ వికెట్‌ తీసిన తర్వాత ఉమ్రాన్‌ మాలిక్‌.. ధావన్‌ స్టైల్‌ను అనుకరించడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ధావన్‌ ఎప్పుడు క్యాచ్‌ పట్టినా.. లేక సెంచరీ చేసిన తొడ గొట్టడం అలవాటు. ఇప్పుడు ధావన్‌ స్టైల్‌ను ఉమ్రాన్‌ మాలిక్‌ అనుకరించాడు. వికెట్‌ దక్కగానే తన చేతితో తొడను గట్టిగా చరుస్తూ ధావన్‌కేసి చూశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అయితే ఇంత బాగా బౌలింగ్‌ చేసిన ఉమ్రాన్‌ మాలిక్‌ను ఇటీవలే ముగిసిన టి20 ప్రపంచకప్‌కు ఎంపిక చేయకపోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  గతంలో మాదిరిగా వేగంగా వేయడమే కాకుండా వేరియేషన్స్‌తో ఉమ్రాన్ బౌలింగ్ చేస్తున్నాడు. ఫుల్ లెంగ్త్, బ్యాక్ లెంగ్త్, స్లోయర్స్, యార్కర్, షాట్ పిచ్ బాల్స్‌తో బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్నాడు. దాంతో ఉమ్రాన్ మాలిక్‌పై అభిమానులు ప్రశంసల జల్లు కురిపించారు.

అసలు ఉమ్రాన్ మాలిక్‌ను బీసీసీఐ తక్కువ అంచనా వేసిందని, అతని ప్రతిభను గుర్తించి వరుసగా అవకాశాలు ఇచ్చి ప్రపంచకప్ ఆడించాల్సిందని అభిప్రాయపడుతున్నారు. ఐపీఎల్‌లో సంచలన ప్రదర్శన ఇచ్చిన తర్వాత కూడా ఉమ్రాన్ మాలిక్ ఏం చేయగలడో రోహిత్ శర్మ తెలుసుకోలేకపోయాడని విమర్శిస్తున్నారు. ప్రపంచకప్‌కు ఉమ్రాన్‌ మాలిక్‌ను పక్కనపెట్టి బీసీసీఐ ఘోర తప్పిదం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు