Sanju Samson: ఒక్క మ్యాచ్‌కే పక్కనబెట్టారు.. సౌత్‌ ప్లేయర్ అనేగా వివక్ష

27 Nov, 2022 11:56 IST|Sakshi

టాలెంటెడ్‌ ఆటగాడు సంజూ శాంసన్‌కు మరోసారి అన్యాయం జరిగింది. ఆదివారం కివీస్‌తో మొదలైన రెండో వన్డేలో శాంసన్‌ను ఎంపిక చేయలేదు. దీంతో శాంసన్‌ను కేవలం ఒక్క మ్యాచ్‌కే పరిమితం చేశారా అంటూ అభిమానులు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజూ శాంసన్‌పై ఎందుకంత వివక్ష చూపిస్తున్నారు.. సౌత్‌ ప్లేయర్‌ అనేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక శాంసన్‌ న్యూజిలాండ్‌ పర్యటనకు ఎంపికయ్యాడన్న మాటే కానీ ఒక్క మ్యాచ్‌ కూడా ఆడించకపోవడంపై విమర్శలు వచ్చాయి. హార్దిక్‌ పాండ్యా నేతృత్వంలోని టి20 జట్టులో శాంసన్‌కు చోటు దక్కలేదు. మరి ఆ విమర్శలకు భయపడ్డారేమో తెలియదు కానీ ఉన్నపళంగా కివీస్‌తో జరిగిన తొలి వన్డేకు సంజూకు అవకాశం ఇచ్చారు. మ్యాచ్‌లో భారీ స్కోరు చేయకపోయినప్పటికి మరి తీసిపారేసేంత చెత్తగా మత్రం ఆడలేదు.

దారుణంగా విఫలమవుతున్న పంత్‌తో పోలిస్తే సంజూ శాంసన్‌ చాలా బెటర్‌గా కనిపించాడు. పంత్‌ 15 పరుగులు చేసి ఔటవ్వగా.. సంజూ శాంసన్‌ 38 బంతుల్లో 36 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే సుందర్‌(37 నాటౌట్‌)తో కలిసి మంచి భాగస్వామ్యం నమోదు చేశాడు. వీరిద్దరి ఇన్నింగ్స్‌తోనే ఆ మ్యాచ్‌లో టీమిండియా 300 పరుగులు మార్క్‌ను దాటింది. అయితే పేలవమైన బౌలింగ్‌ కారణంగా టీమిండియా ఆ మ్యాచ్‌లో ఓడిపోయింది. 

ఇదిలా ఉంటే రెండో వన్డేలో సంజూ శాంసన్‌పై మరోసారి వేటు పడింది . తొలి వన్డేలో భారత బౌలర్లు వికెట్లు తీయడంలో ఫెయిల్ అయ్యారు. దీంతో ఆల్‌రౌండర్ దీపక్ హుడాకి తుదిజట్టులో చోటు దక్కింది. హుడాని జట్టులోకి తీసుకురావాలనుకుంటే పేలవ ఫామ్‌లో ఉన్న రిషబ్ పంత్‌ని తప్పించొచ్చు. అలాగే సూర్యకుమార్ యాదవ్ టి20 ఫార్మాట్‌లో దుమ్మురేపుతున్నా.. వన్డేల్లో మాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు. విఫలం అవుతున్న ఈ ఇద్దరినీ కొనసాగించిన టీమిండియా.. సంజూ శాంసన్‌ను మాత్రం పక్కనబెట్టేసింది.

సంజూ శాంసన్‌ను ఎంపిక చేయకపోవడంపై ధావన్‌ సహా జట్టు మేనేజ్‌మెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్‌తో రెచ్చిపోయారు అభిమానులు.  ''సంజూ శాంసన్.. దక్షిణ భారతదేశానికి చెందిన వాడు కావడం వల్లే అతనికి తుదిజట్టులో చోటు ఇవ్వకుండా వివక్ష చూపిస్తున్నారు.. శిఖర్ ధావన్, శుబ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, అర్ష్‌దీప్ సింగ్, యజ్వేంద్ర చాహాల్, ఉమ్రాన్ మాలిక్... ఇలా భారత జట్టులో ఉన్న ప్లేయర్లు అందరూ నార్త్ ఇండియాకి చెందినవాళ్లే... ఒక్క వాషింగ్టన్ సుందర్ తప్ప!''.. ''సంజూ శాంసన్ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన దీపక్ హుడా కూడా నార్త్ ఇండియనే'' అంటూ ధ్వజమెత్తారు.

''సంజూ ఇండియాలో ఉంటూ అవకాశాల కోసం ఎదురుచూసే కంటే వేరే దేశానికి వెళ్తే స్టార్ ప్లేయర్ అవ్వడం ఖాయం''..''ఇంతకముందు త్రిబుల్ సెంచరీ చేసిన తర్వాత కూడా కరణ్ నాయర్‌.. ఆస్ట్రేలియాలో అదిరిపోయే ప్రదర్శన ఇచ్చిన టి.నటరాజన్.. ఆ తర్వాత కనిపించకపోవడానికి కూడా ఈ వివక్షే కారణమని''  కొంతమంది అభిమానులు పేర్కొన్నారు.

చదవండి: పెద్దగా పరిచయం లేని ఆటగాళ్లకు భారీ ధర.. అసలు ఎలా ఎంపిక చేస్తారు?

FIFA WC: నువ్వయ్యా అసలు సిసలైన అభిమానివి!

మరిన్ని వార్తలు