Fans Troll Kasun Rajitha: ఎంత పని చేశావ్‌.. లంక జట్టులో మరో 'హసన్‌ అలీ'

20 Jul, 2022 16:58 IST|Sakshi

శ్రీలంకతో జరిగిన తొలి టెస్టును పాకిస్తాన్‌ 4 వికెట్ల తేడాతో గెలిచి 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఓపెనర్‌ అబ్దుల్లా షఫీక్‌ (408 బంతుల్లో 160 పరుగులు నాటౌట్‌) వీరోచిత సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. షఫీక్‌కు తోడూ బాబర్‌ ఆజం అర్థ సెంచరీతో రాణించగా.. మహ్మద్‌ రిజ్వాన్‌ 40 పరుగులు చేసి ఔటయ్యాడు. కాగా అబ్దుల్లా షఫీక్‌ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను లంక ఆటగాడు కాసున్‌ రజిత జారవిడవడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. డిసిల్వా బౌలింగ్‌లో షాట్‌ ఆడబోయి బ్యాట్‌ ఎడ్జ్‌ తాకడంతో గాల్లోకి లేచింది. బౌండరీలైన వద్ద ఉన్న కాసున్‌ రజిత అందుకున్నట్లే అందుకొని జారవిడిచాడు. అయితే  ఈ క్యాచ్‌ పట్టడం వల్ల కూడా లంకకు పెద్ద ఉపయోగం ఉండేది కాదు. ఎందుకుంటే అప్పటికి పాక్‌ విజయానికి 19 పరుగుల దూరంలో మాత్రమే ఉంది. 

కానీ కాసున్‌ రజితను మాత్రం అభిమానులు ఒక ఆట ఆడుకున్నారు. అతన్ని పాక్‌ క్రికెటర్‌ హసన్‌ అలీతో పోల్చారు. కీలక సమయంలో క్యాచ్‌లను జారవిడుస్తాడన్న అపవాదును హసన్‌ అలీ ఇంతకముందు చాలాసార్లు మూటగట్టుకున్నాడు. టి20 ప్రపంచకప్‌ 2021 సెమీఫైనల్లో ఆస్ట్రేలియా బ్యాటర్‌ మాథ్యూ వేడ్‌ ఇచ్చిన క్యాచ్‌ను డీప్‌ మిడ్‌వికెట్‌ వద్ద ఉన్న హసన్‌ అలీ చేతిలోకి వచ్చినప్పటికి అందుకోవడంలో విఫలమయ్యాడు. అంతే ఆ తర్వాత మాథ్యూ వేడ్‌ వరుసగా మూడు సిక్సర్లు కొట్టి ఆసీస్‌ను ఫైనల్‌ చేర్చాడు.

అలా ఆరంభం నుంచి మంచి ప్రదర్శన చేస్తూ వచ్చిన పాకిస్తాన్‌.. హసన్‌ అలీ వదిలేసిన ఒక్క క్యాచ్‌ వల్ల మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా చాలా సందర్భాల్లో హసన్‌ అలీ క్యాచ్‌లు జారవిడిచాడు. తాజాగా లంకతో తొలి టెస్టులోనూ హసన్‌ అలీ ఇదే సీన్‌ను రిపీట్‌ చేశాడు. రెండు క్యాచ్‌లు జారవిడవడంతో పాటు సింపుల్‌ రనౌట్‌ చేసే చాన్స్‌ను కూడా మిస్‌ చేశాడు.  తాజాగా కాసున్‌ రజితను కూడా హసన్‌ అలీతో పోలుస్తూ అభిమానులు కామెంట్స్‌ చేశారు. ''హసన్‌ అలీ నుంచి స్పూర్తి పొందినట్లున్నాడు.. వెల్‌కమ్‌ టూ హసన్‌ అలీ అకాడమీ.. లంక జట్టులో హసన్‌ అలీని చూశాం.. క్యాచ్‌ పట్టినా పెద్దగా ప్రయోజనం ఉండేది కాదులే..'' అంటూ రజితను ఒక ఆట ఆడుకున్నారు. 

చదవండి: షఫీక్‌ సూపర్‌ సెంచరీ.. లంకపై పాక్‌ ఘన విజయం

మరిన్ని వార్తలు