#ManishPandey: 'నువ్వు ఆడకపోతివి.. ఆడేటోడిని రనౌట్‌ జేస్తివి!'

10 May, 2023 22:34 IST|Sakshi
Photo: IPL Twitter

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా సీఎస్‌కేతో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తడబడుతుంది. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆదిలోనే వార్నర్‌ వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత మరో ఓపెనర్‌ ఫిలిప్‌ సాల్ట్‌ కూడా తక్కువ పరుగులకే వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చిన మనీష్‌ పాండే ప్రభావం చూపాల్సింది పోయి తన జట్టు ఆటగాడికే ఎసరు పెట్టాడు. ఫామ్‌లో ఉన్న మిచెల్‌ మార్ష్‌ను అనవసరంగా రనౌట్‌ అయ్యేలా చేశాడు.

ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్‌ తుషార్‌ దేశ్‌పాండే వేశాడు. ఓవర్ తొలి బంతిని మనీష్‌ పాండే కవర్స్‌ దిశగా ఆడాడు. మనీష్‌ ముందుకు కదలడంతో సింగిల్‌కు పిలిచాడనుకొని మార్ష్‌ పరిగెత్తాడు. మనీష్‌ పరిగెత్తినట్లే చేసి మళ్లీ వెనక్కి వచ్చాడు. అప్పటికే మార్ష్‌ సగం క్రీజు దాటాడు. బంతిని అందుకున్న రహానే తెలివిగా వ్యవహరించాడు.

త్రో వేయకుండా నేరుగా నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌వైపు పరిగెత్తాడు. మార్ష్‌ స్ట్రైక్‌ ఎండ్‌కు చేరుకున్నప్పటికి మనీష్‌ పాండే తన వికెట్‌ను త్యాగం చేయడానికి ఇష్టపడలేదు. దీంతో రహానే వికెట్లను ఎగురగొట్టడంతో పాపం మార్ష్‌ రనౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది.

ఇక్కడ తప్పంతా మనీష్‌ పాండేదే అని క్లియర్‌గా అర్థమవుతుంది. స్ట్రైక్‌ ఎండ్‌వైపు వచ్చిన మార్ష్‌.. మనీష్‌ పాండేను ముందుకు వెళ్లాలని కోరినా పట్టించుకోలేదు. అయితే మార్ష్‌ ఔట్‌కు తానే కారణమని తెగ బాధపడిపోయిన మనీష్‌ పాండే తన చేత్తో హెల్మెట్‌ను బలంగా కొట్టుకోవడం కొసమెరుపు.

ఇక మార్ష్‌ను ఔట్‌ చేసి తాను ఏమైనా ఆడాడా అంటే అదీ లేదు. పైగా 29 బాల్స్‌ ఎదుర్కొని 27 పరుగులు చేసి పతీరానా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. పాండే పనితనం ఎలా ఉందంటే.. తాను ఆడకపోగా.. ఫామ్‌లో ఉన్న బ్యాటర్‌ను అనవసరంగా ఔట్‌ చేసి విలన్‌గా తయరయ్యాడు. 

దీంతో మనీష్‌ పాండేపై క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫామ్‌లో ఉన్న బ్యాటర్‌ను అనవసరంగా రనౌట్‌ చేశావు.. ఆడేవాడిని ఔట్‌ చేశావు.. నువ్వు ఆడకపోయావో అంతే సంగతి.. అంటూ కామెంట్‌ చేశారు.

చదవండి: క్రేజ్‌ మాములుగా లేదు.. యాడ్‌ వేయలేని పరిస్థితి!

చదవండి: రహానే షాక్‌ తిన్న వేళ.. అంపైర్‌ ఇంప్రెస్‌ అయ్యాడు

మరిన్ని వార్తలు