-

ENG Vs PAK: 'యార్‌..నెంబర్‌ వన్‌ బౌలింగ్‌'.. పాక్‌ జట్టును ఆడేసుకున్నారు

1 Dec, 2022 20:04 IST|Sakshi

పాక్‌, ఇంగ్లండ్‌ల మధ్య తొలి టెస్టు మ్యాచ్‌.. ఆఫ్‌సైడ్‌ వేస్తే కొట్టారు.. ఆన్‌సైడ్‌ వేస్తే కొట్టారు.. ఫుల్‌టాస్‌ వేస్తే కొట్టారు.. ఇలా బంతి ఎక్కడ వేసినా కొడుతూనే ఉన్నారు. తొలిరోజు ఆట ముగిసింది కాబట్టి కొట్టుడుకు విరామం వచ్చింది లేదంటే ఇంగ్లండ్‌ ఒక్కరోజులోనే వెయ్యి పరుగులు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంత నాసిరకంగా తయారైంది పాక్‌ బౌలింగ్‌. పాపం ఈ విషయంలో పాక్‌ బౌలర్లను కూడా తప్పుబట్టలేం.

17 ఏళ్ల తర్వాత పాక్‌ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్‌కు చుక్కలు చూపించాలనుకున్నారు పాక్‌ ఆటగాళ్లు. కానీ సీన్‌ మొత్తం రివర్స్‌ అయింది. పాక్‌ బౌలర్లు చెడుగుడు ఆడతారనుకుంటే ఇంగ్లండ్‌ బ్యాటర్లే వారిని చీల్చి చెండాడారు. ఎందుకంటే అసలు పిచ్‌పై జీవం ఉందా లేదా అన్న సంశయం మ్యాచ్‌ మొదలైన కాసేపటికే అర్థమయిపోయింది. ఎంత నాసిరకం పిచ్‌ అయినా బౌలర్లకు కొంతమేరైనా సహకారం అందిస్తాయి. కానీ ఇంగ్లండ్‌తో టెస్టులో మాత్రం అలా జరగలేదు.

పాక్‌ బౌలర్లు వరుసబెట్టి బౌలింగ్‌కు వచ్చినప్పుడల్లా ఎందుకు వచ్చామా అన్నట్లుగా బాధపడినట్లు వారి మొహాలు చూస్తే తెలిసిపోతుంది. బాబర్‌ ఆజం బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించినా లాభం లేకపోయింది. ఎక్కడ బంతి వేసినా కొట్టుడే పనిగా పెట్టుకున్న ఇంగ్లండ్‌ బ్యాటర్ల దెబ్బకు తలలు పట్టుకున్నారు.

అయితే ఇటీవల ముగిసిన టి20 ప్రపంచకప్ లో పాకిస్తాన్ తో ఆడిన ఏ జట్టు కూడా  165 రన్స్ కొట్టలేదు.  షాహీన్ అఫ్రిది, హరీస్ రౌఫ్,  నసీమ్ షా, మహ్మద్ వసీం,  షాదాబ్ వంటి బౌలర్లు ప్రత్యర్థులను కట్టడి చేశారు. కానీ సొంతగడ్డపై పాక్ బౌలర్లు ఇంగ్లాండ్ బ్యాటర్ల ధాటికి  బేజారయ్యారు. ఆరుగురు బౌలర్లు  వికెట్ల కోసం పడరాని పాట్లు పడ్డారు. 

నసీమ్ షా, మహ్మద్ అలీ, హరీస్ రౌఫ్, జహీద్ మహ్మద్, అగా సల్మాన్, సౌద్ షకీల్‌లు వికెట్ల కోసం కాకుండా పరుగులు సమర్పించుకోవడంలో పోటీ పడ్డట్లుగా అనిపించింది. వీరిలో  ఏ ఒక్క బౌలర్ ఎకానమీ కూడా  5 కంటే తక్కువ లేదంటే అతిశయోక్తి కాదు. ఒకర్ని మించి ఒకరు ధారాళంగా పరుగులిచ్చుకున్నారు. ఇంగ్లండ్‌ బ్యాటర్లు అలసిపోయి వికెట్లు ఇచ్చారు తప్ప పాక్‌ బౌలర్లు పెద్దగా కష్టపడింది లేదు.

పాక్‌ చెత్త బౌలింగ్‌పై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్‌ వచ్చాయి. యార్‌ నెంబర్‌ వన్‌ బౌలింగ్‌.. ఇది కదా బౌలింగ్‌ అంటే.. ఇదేం బౌలింగ్‌ రా నాయనా.. వెల్‌డన్‌ పాక్‌ బౌలర్స్‌.. ఒక్కరోజులో 500 పరుగులు కొట్టించుకున్నారు.. మీకు మాత్రమే సాధ్యమైంది అంటూ కామెంట్స్‌ చేశారు. మరికొందరు ఫన్నీ మీమ్స్‌తో పాక్‌ జట్టను ఆడేసుకున్నారు.

ఇక తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ 75 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 506 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్‌ 101 అజేయ శతకంతో ఆడుతుండా.. బెన్‌ స్టోక్స్‌ 34 పరుగులతో క్రీజులో ఉన్నాడు. అంతకముందు ఓలీ పోప్‌, జాక్‌ క్రాలీ, బెన్‌ డకెట్‌లు శతకాలతో రెచ్చిపోయారు. ఒక టెస్టు మ్యాచ్‌లో నలుగురు శతకాలు బాదడం ఇదే తొలిసారి కాగా.. తొలిరోజే 500 పరుగులు చేసిన తొలి జట్టుగా ఇంగ్లండ్‌ రికార్డులకెక్కింది. పాక్‌ బౌలర్లలో జహీద్ మహ్మద్ కు రెండు వికెట్లు తీయగా.. హరీస్ రౌఫ్, మహ్మద్ అలీలకు చెరొక వికెట్ దక్కింది. 

చదవండి: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్‌ బ్యాటర్లు.. 112 ఏళ్ల రికార్డు బద్దలు

మరిన్ని వార్తలు