PSL 2022: ఇంత దరిద్రమైన ఎంట్రీ ఎప్పుడు చూడలేదు.. అఫ్రిదిపై ట్రోల్స్‌ వర్షం

4 Feb, 2022 19:10 IST|Sakshi

4 ఓవర్లలోనే 67 పరుగులు.. అబ్బా ఏం ఆడాడు అనుకుంటే పొరపాటే అవుతుంది. ఎందుకుంటే 67 పరుగులు వచ్చింది బ్యాటింగ్‌లో కాదు.. బౌలింగ్‌లో. ఇంతకీ ఎవరా క్రికెటర్‌ అనుకుంటున్నారా.. పాకిస్తాన్‌ మాజీ ఆటగాడు షాహిద్‌ అఫ్రిది 

అఫ్రిది పాకిస్తాన్‌ ప్రీమియర్‌ లీగ్‌( పీఎస్‌ఎల్‌లో) అడుగుపెట్టాడు. పీఎస్‌ఎల్‌లో క్వెటా గ్లాడియేటర్స్‌ తరపున ఆడుతున్న అఫ్రిది ఇస్లామాబాద్‌ యునైటెడ్‌తో మ్యాచ్‌ ద్వారా ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడాడు. అయితే అఫ్రిదికి తన ఎంట్రీ మ్యాచ్‌ ఒక పీడకలగా మిగిలిపోయింది.  బౌలింగ్‌లో 4 ఓవర్లు వేసిన అఫ్రిది 67 పరుగులిచ్చి ఒకే ఒక్క వికెట్‌ తీశాడు. బ్యాటింగ్‌లోనైనా ఇరగదీశాడా అనుకుంటే అది లేదు. 8 బంతులు మింగి 4 పరుగులు చేసి నిర్లక్ష్యంగా వికెట్‌ పారేసుకున్నాడు.

చదవండి: PSL 2022: ఫఖర్‌ జమాన్‌ తొందరపడ్డావు.. కాస్త ఆగుంటే బాగుండేది

దీంతో అభిమానులు అఫ్రిదిని ట్రోల్‌ చేస్తూ ఒక ఆట ఆడుకున్నారు. ''అబ్బా ఏం ఎంట్రీ ఇచ్చావ్‌.. మతి పోయింది.. అఫ్రిది క్రికెట్‌ ఆడడం ఆపేయ్‌.. నీ వయసువాళ్లు కామెంటేటరీ చెప్తున్నారు.. ఈ మధ్య కాలంలో ఇంత దరిద్రమైన ఎంట్రీ చూడలేదు'' అంటూ  కామెంట్స్‌ చేశారు. ఇక  మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇస్లామాబాద్‌ యునైటెడ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. కొలిన్‌ మున్రో(39 బంతుల్లో 72, 3 ఫోర్లు, 5 సిక్సర్లు), అజమ్‌ ఖాన్‌(35 బంతుల్లో 65, 2 ఫోర్లు, 6 సిక్సర్లు), పాల్‌ స్టిర్లింగ్‌(28 బంతుల్లో 58, 7 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన క్వెటా గ్లాడియేటర్స్‌ 19.3 ఓవర్లలో 186 పరుగులుకు ఆలౌటైంది. ఆషన్‌ అలీ 50, మహ్మద్‌ నవాజ్‌ 47 పరుగులు చేశారు.

మరిన్ని వార్తలు