Fans Troll Shoaib Akthar: 'ఉన్నప్పుడు పెద్దగా ఏం పీకలేదు.. ఇప్పుడెందుకు ఈ ముచ్చట్లు'

11 Jun, 2022 20:22 IST|Sakshi

క్రికెట్‌లో చిరకాల ప్రత్యర్థులు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది టీమిండియా, పాకిస్తాన్‌లు. ఈ రెండు జట్లు ఎప్పుడు ఎక్కడ తలపడినా సరే.. ఆయా దేశాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. ఓడిన జట్టు విమర్శల పాలైతే.. గెలిచిన జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తుంది. ఇక వరల్డ్‌కప్‌ లాంటి మేజర్‌ టోర్నీలైతే ఇక చెప్పనవసరం లేదు. కప్‌ గెలవకపోయినా సరే.. చిరకాల ప్రత్యర్థిపై విజయం సాధిస్తే చాలని రెండు దేశాల అభిమానులు కోరుకుంటారు. ఇప్పటివరకు జరిగిన వన్డే వరల్డ్‌కప్‌ల్లో పాకిస్తాన్‌ టీమిండియాను ఒక్కసారి కూడా ఓడించలేకపోయింది.

2011 వన్డే వరల్డ్‌కప్‌లో కీలకమైన సెమీఫైనల్లో దాయాదులు తలపడ్డాయి. సెమీస్‌ మ్యాచ్‌ కావడంతో ఈ మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొంది. మొహలీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌కు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా అప్పటి ఇరు దేశాల ప్రధానమంత్రులు మొహాలీకి తరలివచ్చారు. ఎంఎస్ ధోని సారథ్యంలోని టీమిండియా  టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ (85), వీరేంద్ర సెహ్వాగ్ (38), సురేశ్ రైనా (36) రాణించారు. పాక్ తరఫున వహాబ్ రియాజ్ 5 వికెట్లు తీశాడు.

అయితే లక్ష్య ఛేదనలో పాక్.. 49.5 ఓవర్లలో 231 పరుగుల వద్దే ఆలౌట్ అయింది. మిస్బా ఉల్ హక్ (56), మహ్మద్ హఫీజ్ (43) లు  పాక్ ను ఆదుకున్నారు. భారత బౌలర్లు (జహీర్ ఖాన్, ఆశిష్ నెహ్రా, మునాఫ్ పటేల్, హర్భజన్ సింగ్, యువరాజ్) లు సమిష్టిగా రాణించి తలా రెండు వికెట్లు తీసి భారత్ కు విజయాన్ని అందించారు.  దీంతో ఫైనల్‌ చేరిన టీమిండియా ఆ తర్వాత శ్రీలంకను ఓడించి 28 ఏళ్ల తర్వాత విశ్వ విజేతగా అవతరించింది.మరి ఇదంతా ఇప్పుడెందుకు చెబుతున్నారనే కాదా మీ డౌటూ. అక్కడికే వస్తున్నాం. 2011 వన్డే వరల్డ్‌కప్‌ సెమీస్‌ మ్యాచ్‌పై తాజాగా పాకిస్తాన్‌ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఆడి ఉంటే భారత్ తక్కువ స్కోరుకే ఆలౌట్ అయ్యేదని.. ప్రపంచకప్ ఫైనల్‌కు పాకిస్తాన్ వెళ్లేదంటూ పేర్కొన్నాడు.

అక్తర్ మాట్లాడుతూ.. ‘మొహాలీ జ్ఞాపకాలు నన్ను తీవ్రంగా వెంటాడుతున్నాయి. 2011 వరల్డ్ కప్ సెమీస్ లో నేను ఆడి ఉండాల్సింది.  కానీ మా టీమ్ మేనేజ్‌మెంట్‌ మ్యాచ్‌కు ఫిట్ గా లేనని నన్ను పక్కనబెట్టింది. ఇది దారుణం.  నేను భారత్ ను ఓడించి పాక్  ను వాంఖెడే (పైనల్ జరిగిన స్టేడియం) కు తీసుకెళ్లాలని భావించా.  స్వదేశంలో మాతో మ్యాచ్ అంటే భారత్ పై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. దేశ ప్రజలు, మీడియా అంతా మ్యాచ్ గురించే మాట్లాడుకుంటున్నారు. అసలు మమ్మల్ని పరిగణనలోకి తీసుకోలేదు. దాంతో మాపై ఒత్తిడి లేదు. ఆ మ్యాచ్ లో గనక నేను ఆడి ఉంటే సచిన్, సెహ్వాగ్ లను  ముందే ఔట్ చేసేవాడిని.

దాంతో టీమిండియా బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలిపోయేది. దాంతో మేం మ్యాచ్ ను ఈజీగా నెగ్గేవాళ్లం. ఆ మ్యాచ్ లో నన్ను డగౌట్ లో కూర్చోబెట్టి పాక్  ఓడిపోతుంటే చూడటం నేను తట్టుకోలేకపోయా. అంత కీలక మ్యాచ్ లో ఓడితే చాలా మంది ఏడుస్తారు. కానీ నేను అలా కాదు.  ఏడ్వడం కంటే నా చుట్టు పక్కల ఉన్న వస్తువులను పగలగొడతా. మేం ఓడిపోతున్నప్పుడు కూడా చాలా వస్తువులు పగలగొట్టా. నేను చాలా నిరాశకు గురయ్యా.  ఆ వేదన ఇప్పటికీ నన్ను వెంటాడుతుంది..’ అని తెలిపాడు.

అక్తర్ చేసిన వ్యాఖ్యలపై టీమిండియా అభిమానులు తమదైన శైలిలో కౌంటర్‌ ఇచ్చారు. ''అంతకముందు 2003 వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా, పాకిస్తాన్‌ మ్యాచ్‌ జరిగినప్పుడు జట్టులోనే ఉన్నావుగా. మీ జట్టు ఓడిపోయిన సంగతి మరిచిపోయావా.. నీ బౌలింగ్‌లో సచిన్‌ శివతాండవం చేసింది గుర్తులేదా.. జట్టులో ఉన్నప్పుడు పెద్దగా పీకింది ఏం లేదు.. ఇప్పుడెందుకు ఈ ముచ్చట్లు'' అని కామెంట్స్‌ చేశారు.

చదవండి: Tilak Varma: ఒక్క రూపాయి కూడా ఉంచుకోలేదు.. దటీజ్‌ తిలక్‌ వర్మ

ఓవైపు భారత్‌, సౌతాఫ్రికా మ్యాచ్‌.. స్టేడియంలో కొట్టుకు చచ్చిన అభిమానులు.. వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు