Ishan Kishan: చేతులు కాలాకా ఆకులు పట్టుకోవడం అంటే ఇదే!

10 Dec, 2022 16:10 IST|Sakshi

బంగ్లాదేశ్‌ పర్యటనకు వచ్చిన టీమిండియా మూడు వన్డేల సిరీస్‌ను 2-0తేడాతో ఆతిథ్య జట్టుకు కోల్పోయింది. బంగ్లాదేశ్‌ గడ్డపై టీమిండియా వన్డే సిరీస్‌ ఓడిపోవడం ఇది వరుసగా రెండోసారి. ఇక చేతులు కాలాకా ఆకులు పట్టుకున్నట్లుగా తయారైంది టీమిండియా పరిస్థితి.

వన్డే సిరీస్‌ కోల్పోయాకా టీమిండియాకు జ్ఞానోదయం అయినట్లుంది. వరుసగా విఫలమవుతున్నప్పటికి ధావన్‌కు అవకాశాలిస్తూనే వచ్చారు తప్ప ఇషాన్‌ కిషన్‌ను కనీసం పరిగణలోకి తీసుకోలేదు. దీంతో ఇషాన్‌కు తొలి రెండు వన్డేల్లో అసలు అవకాశమే దక్కలేదు. అయితే రోహిత్‌ గాయం ఇషాన్‌ కిషన్‌కు కలిసి వచ్చింది. హిట్‌మ్యాన్‌ గాయంతో మూడో వన్డేకు దూరం కావడంతో అతని స్థానంలో ఇషాన్‌ తుది జట్టులోకి వచ్చాడు. తనకు వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్న ఇషాన్‌ వచ్చీ రావడంతోనే డబుల్‌ సెంచరీ సాధించి ఔరా అనిపించాడు.

వన్డేల్లో అత్యంత వేగంగా డబుల్‌ సెంచరీ మార్క్‌ అందుకున్న తొలి క్రికెటర్‌గా ఇషాన్‌ కొత్త రికార్డు నెలకొల్పాడు. ఒకవేళ ఇషాన్‌ కిషన్‌ను తొలి రెండు వన్డేల్లో ఆడించి ఉంటే పరిస్థితి కచ్చితంగా వేరుగా ఉండేదని అభిమానులు అభిప్రాయపడ్డారు.  ఇక మూడో వన్డేలో డబుల్‌ సెంచరీతో చెలరేగిన ఇషాన్‌ కిషన్‌ ఓవరాల్‌గా 131 బంతుల్లో 210 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 24 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి.

ఇక వన్డేల్లో డబుల్‌ సెంచరీ చేసిన నాలుగో భారత క్రికెటర్‌గా కిషన్‌ రికార్డులకెక్కాడు. అంతకుముందు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్‌ శర్మ ఈ ఘనతను సాధించారు. ఇక ఓవరాల్‌గా ఈ రికార్డు సాధించిన జాబితాలో కిషాన్‌ ఏడో  స్థానంలో నిలిచాడు.

చదవండి: చరిత్ర సృష్టించిన ఇషాన్‌ కిషన్‌.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా

మరిన్ని వార్తలు