IND Vs NZ: సంజూకు దక్కని చోటు.. జాఫర్‌ను దుమ్మెత్తిపోసిన అభిమానులు

24 Nov, 2022 18:44 IST|Sakshi

‍టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్‌పై భారత​ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి ప్రధాన కారణం సంజూ శాంసన్‌ను ఎంపిక చేయకపోవడమే. అదేంటి సంజూను ఎంపిక చేయకపోతే జాఫర్‌ను ఎందుకు తిడుతున్నారన్న డౌట్‌ వస్తుందా.. అయితే ఈ వార్త చదివేయండి. ప్రస్తుతం టీమిండియా న్యూజిలాండ్‌ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే టి20 సిరీస్‌ను ముగించుకున్న టీమిండియా రేపటి నుంచి(నవంబర్‌ 25) వన్డే సిరీస్‌ ఆడనుంది. రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ స్థానంలో శిఖర్‌ ధావన్‌ జట్టును నడిపించనున్నాడు. అయితే మ్యాచ్‌కు తుది జట్టులో ఎవరు ఉంటారనే దానిపై కొంత ఆసక్తి నెలకొంది. టి20 సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్‌ పాండ్యా టాలెంటెడ్‌ ప్లేయర్‌ సంజూ శాంసన్‌ను పూర్తిగా పక్కనబెట్టాడు. ఆడిన మూడు టి20ల్లో ఒక్కదానికి కూడా ఎంపిక చేయలేదు. దీంతో జట్టు మేనేజ్‌మెంట్‌ సహా పాండ్యాపై  అభిమానుల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి.

ఈ విషయం పక్కనబెడితే తాజాగా జాఫర్‌.. నవంబర్‌ 25 న్యూజిలాండ్‌తో ఆడనున్న తొలి వన్డేకు 11 మందితో కూడిన తుది జట్టును ప్రకటించాడు. ఇందులో సంజూ శాంసన్‌కు చోటు ఇవ్వలేదు. ఇదే జాఫర్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణమైంది. తొలి వన్డేకు జాఫర్‌ ప్రకటించిన జట్టులో శిఖర్‌ ధావన్‌, శుబ్‌మన్‌ గిల్‌ను ఓపెనర్లుగా ఏంచుకున్నాడు. ఆ తర్వాత శ్రేయాస్‌ అయ్యర్‌ను మూడో స్థానం, సూర్యకుమార్‌ యాదవ్‌కు నాలుగో స్థానం కేటాయించాడు. ఇక ఆల్‌రౌండర్ల కోటాలో దీపక్‌ హుడా, వాషింగ్టన్‌ సుందర్‌, శార్దూల్‌ ఠాకూర్‌లకు అవకాశమిచ్చాడు. ఇక వికెట్‌ కీపర్‌గా జట్టు వైస్‌ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ను ఎన్నుకున్నాడు. పేస్‌ బౌలర్లుగా దీపర్‌ చహర్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌లకు చోటు ఇచ్చాడు.

తన ప్లేయింగ్‌ ఎలెవెన్‌ను ట్విటర్‌లో షేర్‌ చేస్తూ.. ''ఈడెన్‌ పార్క్‌ బౌండరీలు చాలా చిన్నవిగా ఉంటాయి.. ఇక్కడ మణికట్టు స్పిన్నర్లు అవసరం ఉండదు.. అందుకే చహల్‌ను ఎంపిక చేయలేదు. సుందర్‌, హుడాలు తమ బౌలింగ్‌తో న్యూజిలాండ్‌ బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలరు. అలాగే తొమ్మిదో స్థానంలో వచ్చే దీపక్‌ చహర్‌ బ్యాటింగ్‌ చేయగలడు'' అంటూ పేర్కొన్నాడు. 

జాఫర్‌ ప్లేయింగ్‌ ఎలెవెన్‌పై టీమిండియా అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ''సంజూ శాంసన్‌ను ఎందుకు పక్కనబెట్టారు''.. ''మొదటిసారి మీపై మాకు కోపం వస్తుంది.. తుది జట్టులో సంజూకు ఎందుకు చోటివ్వలేదు''.. ''అందరికి సంజూతోనే  సమస్య.. అతని బ్యాటింగ్‌ సగటు.. స్ట్రైక్‌రేట్‌ చూసి మాట్లాడండి''.. ''సంజూకు ఎంతకాలం ఈ అన్యాయం'' అంటూ కామెంట్‌ చేశారు.

జాఫర్‌ ప్లేయింగ్‌ ఎలెవెన్‌ జట్టు: ధావన్ (కెప్టెన్‌), శుబ్‌మన్‌ గిల్, శ్రేయాస్‌ అయ్యర్, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషబ్‌ పంత్ (వికెట్‌ కీపర్‌), దీపక్‌ హుడా, వాషింగ్టన్‌ సుందర్‌, శార్దూల్ ఠాకూర్‌, దీపక్‌ చహర్, అర్ష్‌దీప్‌ సింగ్‌, ఉమ్రాన్ మాలిక్‌

చదవండి: టీ20 జట్టు కోచ్‌గా ద్రవిడ్‌ కంటే అతనే బెటర్‌..! 

FIFA WC: పాపం.. గోల్‌ కొట్టినా సెలబ్రేట్‌ చేసుకోలేక

మరిన్ని వార్తలు