'17 అయితే 28 గా చూపించారు.. ఏం తాగి వచ్చారా?'

27 Jun, 2021 17:59 IST|Sakshi

బ్రిస్టల్‌: టీమిండియా యంగ్‌ ఉమెన్‌ క్రికెటర్‌ షఫాలీ వర్మకు చిత్రమైన అనుభవం ఎదురైంది. అయితే ఆ అనుభవం బ్యాటింగ్‌ విషయంలో కాదు.. ఆమె వయస్సు విషయంలో. విషయంలోకి వెళితే.. టీమిండియా మహిళల జట్టు ఆదివారం ఇంగ్లండ్‌ మహిళల జట్టుతో తొలి వన్డే ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌తో షఫాలీ వర్మ టీమిండియా తరపున వన్డే క్రికెట్‌లో 131వ వుమెన్‌ క్రికెటర్‌గా అరంగేట్రం​చేసింది. 17 ఏళ్ల వయసులోనే షఫాలీ టీమిండియా మహిళల వన్డే జట్టులో చోటు దక్కించుకొని చరిత్ర సృష్టించింది. ఇంతవరకు బాగానే ఉంది. 


మ్యాచ్‌లో టాస్‌ ఓడిన టీమిండియా వుమెన్స్‌ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లుగా షఫాలీ వర్మ, స్మృతి మందన క్రీజులోకి వచ్చారు. మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న సోనీ టెన్‌ చానెల్‌ నిర్వహకులు షఫాలీ స్టాట్స్‌ను తప్పుగా చూపెట్టారు. షఫాలీ వయస్సు 17 ఏళ్లు అయితే.. ఆమెకు 28 ఏళ్లు అన్నట్లుగా టీవీలో డిస్‌ప్లే అయింది. ఇంకేముందు ఇది గమనించిన నెటిజన్లు చానెల్‌ నిర్వాహకులను సోషల్‌ మీడియాలో ఒక ఆట ఆడేసుకున్నారు.

''షఫాలీ వయస్సు 17 అయితే.. 28 అని చూపించారు.. ఏం తాగి వచ్చారా..? అరంగేట్రం మ్యాచ్‌లోనే షఫాలీకి వింత అనుభవం.. ఆమెకు తన వయస్సును తప్పుగా చూపించారని తెలిస్తే ఏమవుతుందో పాపం.. చానెల్‌ నిర్వాహకులు నిద్రపోతూ పనిచేస్తున్నారు''అంటూ కొందరు కామెంట్లు చేశారు. కాగా షఫాలీ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా షఫాలీ వర్మ టీ20ల్లో దూకుడైన ఆటతీరు కనబరుస్తూ అనతికాలంలోనే మంచి పేరు తెచ్చుకుంది. తన దూకుడైన ఆటతీరుతో సెహ్వాగ్‌ను గుర్తుకుతెస్తున్న షఫాలీ కొంతకాలంగా మంచి ఫామ్‌లో ఉంది. ఆమె ఫామ్‌ను దృష్టిలో పెట్టుకొని బీసీసీఐ ఆమెకు వన్డేల్లో ఆడే అవకాశం కల్పించింది. కాగా షఫాలీ టీమిండియా తరపున 22 టీ20ల్లో 617 పరుగులు చేయగా.. ఇందులో మూడు అర్థసెంచరీలు ఉన్నాయి.

ఇక టీమిండియా మహిళల జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా వుమెన్స్‌ జట్టు ప్రస్తుతం 36 ఓవర్లు ఆట ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. మిథాలీ రాజ్‌ 41, దీప్తి శర్మ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు షఫాలీ 15, సృ‍్మతి మందన 10 పరుగులు చేసి ఔటయ్యారు.
చదవండి: లూయిస్‌, గేల్‌ సిక్సర్ల సునామీ.. విండీస్‌దే తొలి టీ20

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు