Ruturaj Gaikwad: రుతురాజ్‌ను పక్కనపెట్టి తప్పుచేస్తున్నారు.. అవకాశమివ్వండి

22 Jan, 2022 21:44 IST|Sakshi

IND Vs SA: సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా తాజాగా వన్డే సిరీస్‌ను ఒక మ్యాచ్‌ మిగిలి ఉండగానే ప్రత్యర్థికి అప్పగించింది. కోహ్లి కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పుకున్న తర్వాత రోహిత్‌ స్థానంలో కెప్టెన్‌గా ఉన్న కేఎల్‌ రాహుల్‌కు నిజంగా బ్యాడ్‌లక్‌ . తాను కెప్టెన్సీ వహిస్తున్న మొదటి సిరీస్‌ను టీమిండియా ఓడిపోవడంతో కలిసి రాలేదని చెప్పొచ్చు. రుతురాజ్‌ గైక్వాడ్‌ లాంటి టాలెంటెడ్‌ ఆటగాడిని బెంచ్‌కే పరిమితం చేసి పెద్ద తప్పు చేస్తున్నారు. అవకాశం ఇస్తేనే కదా అతనేంటో నిరూపించుకునేదంటూ అభిప్రాయపడుతున్నారు. జట్టు కూర్పులో ఇప్పుడున్న పరిస్థితిలో వెంకటేశ్‌ అయ్యర్‌ను జట్టు నుంచి తొలగించి రుతురాజ్‌కు అవకాశం ఇవ్వడం మంచిదని చాలామంది పేర్కొంటున్నారు.

చదవండి: Ashleigh Barty: క్రికెట్‌లో ఆడాల్సిన షాట్‌ టెన్నిస్‌లో ఆడితే..


వాస్తవానికి రుతురాజ్‌ విజయ్‌ హజారే ట్రోఫీలో వరుస సెంచరీలతో దుమ్మురేపి సౌతాఫ్రికా సిరీస్‌కు ఎంపికైన విషయం మరవకూడదు. అంతకముందు జరిగిన ఐపీఎల్‌ 14వ సీజన్‌లోనూ రుతురాజ్‌ లీగ్‌ టాప్‌ స్కోరర్‌గా ఆరెంజ్‌ క్యాప్‌ అందుకున్నాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ను కూడా తుది జట్టులోకి ఎందుకు పరిశీలించడం లేదో అర్థం కావడం లేదు.  దీంతోపాటు డ్రెస్సింగ్‌రూమ్‌లో టీమిండియా రెండుగా చీలిందని.. కోహ్లి, కేఎల్‌ రాహుల్‌లు ఎడమొహం.. పెడమొహంలాగా ఉంటున్నారని వార్తలు వచ్చాయి. తాజాగా టీమిండియా సిరీస్‌ ఓడిపోవడంతో.. టీమిండియా జట్టులో ఐక్యత లేకపోవడం వల్లే ఇలా జరుగుతుందనే వాదనకు బలం చేకూర్చినట్లయింది. ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే.. కోహ్లి కెప్టెన్‌గా ఉన్న ఈ మధ్య కాలంలో జరిగిన ఆరు మ్యాచ్‌ల్లో టీమిండియా ఒక మ్యాచ్‌లో మాత్రమే ఓటమి పాలయింది. కోహ్లి కెప్టెన్సీ వహించని అన్ని మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలవడం గమనార్హం.

చదవండి: టీమిండియాపై వన్డే సిరీస్‌ గెలుపు.. ఇంతలోనే ఐసీసీ అక్షింతలు

ఇక టీమిండియా సిరీస్‌ ఓటమిని  అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మూడో వన్డేకైనా జట్టును కాస్త మార్చండరా బాబు అని మొరపెట్టుకున్నారు. సౌతాఫ్రికా పర్యటన టీమిండియాకు ఒక పీడకల.. టెస్టు సిరీస్‌ పోయింది.. ఇప్పుడు వన్డే సిరీస్‌ కూడా పాయే.. టీమిండియా డ్రెస్సింగ్‌ రూమ్‌లో అసలు ఏం జరుగుతుంది.. రుతురాజ్‌ గైక్వాడ్‌ను ఎందుకు బెంచ్‌కు పరిమితం చేశారు..  టాలెంట్‌ను గుర్తించడం లేదు.. అంటూ ట్విటర్‌ను మోతెక్కిస్తున్నారు.

మరిన్ని వార్తలు