Abdul Razzaq: తనయుడి బౌలింగ్‌లో తండ్రి గోల్డెన్‌ డక్‌

24 Dec, 2022 15:52 IST|Sakshi

కళ్లముందే బిడ్డ ప్రయోజకుడై ఎదుగుతుంటే ఏ తండ్రైనా సంతోషిస్తాడు. అలాంటిది తనకే సవాల్‌గా మారి విజయం సాధిస్తే ఏ తండ్రైనా గర్వపడతాడు. ఇలాంటివి చాలా తక్కువగా చూస్తుంటాం. తాజాగా పాకిస్తాన్‌ మాజీ ఆల్‌రౌండర్‌ అబ్దుల్‌ రజాక్‌ను తనయుడు అలీ రజాక్‌ గోల్డెన్‌ డక్‌ చేయడం వైరల్‌గా మారింది. కింగ్‌డమ్‌ వాలీ  మెగాస్టార్స్‌ లీగ్‌(ఎంఎస్‌ఎల్‌) 2022 లీగ్‌లో ఇది చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. రావల్పిండి వేదికగా పెషావర్‌ పఠాన్స్‌, కరాచీ నైట్స్‌ మధ్య టి10 మ్యాచ్‌ జరిగింది. 

ఈ మ్యాచ్‌లో అబ్దుల్‌ రజాక్‌ పెషావర్‌ పఠాన్స​్‌కు ప్రాతినిధ్యం వహిస్తే.. తనయుడు అలీ రజాక్‌ కరాచీ నైట్స్‌ తరపున ఆడాడు. పెషావర్‌ పఠాన్స్‌ ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌నే అలీ రజాక్‌ వేశాడు. అబ్దుల్‌ రజాక్‌ ఓపెనర్‌గా వచ్చాడు. ఓవర్‌ తొలి బంతినే ఔట్‌సైడ్‌ ఆఫ్‌స్టంప్‌ డెలివరీ వేయగా.. రజాక్‌ బ్యాట్‌ను తగిలించి మూల్యం చెల్లించుకున్నాడు. దీంతో బ్యాట్‌ ఎడ్జ్‌కు తాకి కీపర్‌ చేతుల్లో పడడంతో అబ్దుల్‌ రజాక్‌ గోల్డెన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు.

అంతే తండ్రిని గోల్డెన్‌ డక్‌ చేశానన్న సంతోషాన్ని సహచర ఆటగాళ్లతో పంచుకున్నాడు. అయితే పెవిలియన్‌ బాట పట్టిన అబ్దుల్‌ రజాక్‌ పైకి బాధపడినట్లు కనిపిస్తున్నా.. లోలోపల మాత్రం తనయుడు తనను ఔట్‌ చేశాడన్న ఆనందం కచ్చితంగా ఉండి ఉంటుంది అని అభిమానులు పేర్కొన్నారు. ఇక తొలుత బ్యాటింగ్‌ చేసిన కరాచీ నైట్స్‌ నిర్ణీత 10 ఓవర్లలో 112 పరుగులు చేసింది. దిగ్గజ బ్యాటర్‌ ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ 16 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 29 పరుగులు చేశాడు.  

చదవండి: విజయం దిశగా.. టీమిండియా టార్గెట్‌ 145

మరిన్ని వార్తలు