Shubman Gill: శుబ్‌మన్‌తో జోడీ కలపండి ప్లీజ్‌! ఆ ఛాన్స్‌ లేదు.. మ్యాచ్‌ ఫిక్స్‌ అయిపోయింది!

3 Feb, 2023 12:00 IST|Sakshi
శుబ్‌మన్‌ గిల్‌ (PC: BCCI)

India Vs New Zealand- Shubman Gill: శుబ్‌మన్‌ గిల్‌.. ప్రస్తుతం తన కెరీర్‌లోనే అద్భుత ఫామ్‌లో ఉన్నాడీ టీమిండియా యువ ఓపెనర్‌. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో డబుల్‌ సెంచరీ, సెంచరీతో చెలరేగిన ఈ పంజాబీ బ్యాటర్‌.. టీ20 సిరీస్‌లో కీలక మ్యాచ్‌లో శతకంతో ఆకట్టుకున్నాడు. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ సమక్షంలో పొట్టి ఫార్మాట్‌లో అంతర్జాతీయ స్థాయిలో తొలి సెంచరీ సాధించి.. ఈ జ్ఞాపకాన్ని మరింత పదిలం చేసుకున్నాడు.

అమ్మాయిల కలల రాకుమారుడు!
ఇక ఆటలో తనదైన శైలిలో దూసుకుపోతూ అభిమానులను మురిపిస్తున్న 23 ఏళ్ల ఈ హ్యాండ్సమ్‌ బ్యాటర్‌.. అమ్మాయిల మనసును దోచుకోవడంలోనూ ముందు వరుసలోనే ఉన్నాడు. చూడచక్కని రూపంతో.. అందమైన చిరునవ్వుతో వెలిగిపోయే ఈ సొట్టబుగ్గల కుర్రాడికి లేడీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఎక్కువగానే ఉంది.

శుబ్‌మన్‌తో  జోడీ కలపండి
అహ్మదాబాద్‌ మ్యాచ్‌ సందర్భంగా ఈ విషయం మరోసారి నిరూపితమైంది. నరేంద్ర మోదీ స్టేడియంలో గిల్‌ బ్యాటింగ్‌ మెరుపులు ప్రతక్ష్యంగా వీక్షించేందుకు వచ్చిన ఓ యువతి స్వీట్‌ ప్రపోజల్‌తో ముందుకు వచ్చింది. ‘‘శుబ్‌మన్‌తో నాకు జోడీ కలపండి’’ అంటూ డేటింగ్‌ యాప్‌ను అభ్యర్థిస్తున్నట్లుగా రాసి ఉన్న ప్లకార్డును ప్రదర్శించింది. ఇందుకు సంబంధించిన ఫొటో వైరల్‌ అవుతోంది.

నీకు ఆ ఛాన్స్‌ లేదు!
ఇందుకు స్పందించిన నెటిజన్లు.. ‘‘అయ్యో మీకు ఆ అవకాశం లేదక్కా! ఆల్‌రెడీ తన కోసం బీసీసీఐ మంచి పెళ్లి సంబంధం కుదిర్చినట్లుంది. సచిన్‌ను తీసుకు వచ్చారు. మీకింకా విషయం అర్థంకాలేదా?’’ అని సరదాగా కామెంట్లు చేస్తున్నారు. కాగా అండర్‌ 19 మహిళా ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టును సత్కరించేందుకు సచిన్‌ అహ్మదాబాద్‌కు వెళ్లిన విషయం తెలిసిందే.


గిల్‌- సారా టెండుల్కర్‌

సారా(ల)తో ప్రేమలో?
కాగా.. సచిన్‌ టెండుల్కర్‌ తనయ సారాతో గిల్‌ ప్రేమలో ఉన్నాడంటూ గతంలో కథనాలు రాగా.. ప్రస్తుతం అతడు బాలీవుడ్‌ హీరోయిన్‌ సారా అలీఖాన్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు వదంతులు వ్యాపిస్తున్నాయి. ఏదేమైనా గత కొంతకాలంగా తన ఆట తీరు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విశేషాలతో శుబ్‌మన్‌ గిల్‌ వార్తల్లో నిలుస్తున్నాడు. ముఖ్యంగా సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ అయ్యాడు.


సారా అలీ ఖాన్‌- గిల్‌

భారీ విజయంతో
ఇక అహ్మదాబాద్‌లో ఆఖరిదైన మూడో టీ20లో గిల్‌ 63 బంతుల్లోనే 126 పరుగులు సాధించి చివరి వరకు అజేయంగా నిలిచాడు. అతడి అద్భుత ఇన్నింగ్స్‌కు తోడు బౌలర్లు అత్యుత్తమంగా రాణించడంతో పాండ్యా సేన 168 పరుగులతో భారీ విజయాన్ని అందుకుంది. వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన టీమిండియా... టీ20 ట్రోఫీని కూడా సొంతం చేసుకుంది.

చదవండి: Virat Kohli: విరాట్‌ కోహ్లి స్థానాన్ని భర్తీ చేసే అర్హత అతడికే ఉంది.. వేరే వాళ్లు వద్దు: డీకే
Shubman Gill-Ishan Kishan: గిల్‌పై ఇషాన్‌ కిషన్‌ ఆగ్రహం.. ఏం పట్టనట్లుగా చహల్‌

మరిన్ని వార్తలు